మన శంకరవరప్రసాద్ గారు.. ఆ ఖర్చు ఊరికే పోలేదు
పాత సినిమాలకు, అందులో ఉండే పాటలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనేది అందరికీ తెలిసిన విషయమే.
By: Sravani Lakshmi Srungarapu | 13 Jan 2026 12:45 PM ISTపాత సినిమాలకు, అందులో ఉండే పాటలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇప్పటికీ పాత సినిమాలు, పాత పాటలకు మంచి వాల్యూ ఉంటుంది. ఇప్పటి జెనరేషన్ ఆడియన్స్ కు కూడా 80, 90 కాలం నాటి పాటలంటే ఎంతో ఇష్టం. అప్పటి పాటలకు మంచి సాహిత్యం, కళ్లతోనే నృత్యం చేసే నటీనటులు ఉండటం వల్లే వాటికి అంత క్రేజ్.
పాత పాటలకు మంచి క్రేజ్
ఇప్పటి సాంగ్స్ ఎంత పెద్ద చార్ట్‌బస్టర్లు అయినా మహా అయితే ఓ ఏడాది పాటూ గుర్తుంటాయి కానీ అప్పటి పాటలైతే ఇప్పటికీ మోత మోగుతూనే ఉంటాయి. పాత పాటలకు అంత స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఇప్పటి దర్శకనిర్మాతలు వాడుకుంటున్నారు. పాత పాటలను తమ సినిమాల్లో పెట్టుకుని ఆ క్రేజ్ ను వాడుకుని క్యాష్ చేసుకుంటున్నారు.
కె ర్యాంప్ లో ఇదేమిటమ్మా సాంగ్
రీసెంట్ గా కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమాలో రాజశేఖర్ నటించిన పాత సినిమా పాట ఇదేమిటమ్మాను వాడగా, ఆ సాంగ్ చాలా బాగా క్లిక్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ పాటే సినిమాకు చాలా ప్లస్సయ్యింది. అయితే మేకర్స్ పర్టిక్యులర్ గా ఆ సాంగ్‌నే వాడాలని వాడలేదట. ఆ సాంగ్ హక్కులైతే తక్కువ రేటుకు వస్తాయని తీసుకున్నారట. కానీ తర్వాత అదే సినిమాకు ఎక్కువ టికెట్స్ తెగేలా చేసింది.
మన శంకరవరప్రసాద్ గారులో పలు పాత పాటలు
ఇప్పుడు తాజాగా చిరంజీవి, నయనతార జంటగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు లో కూడా పలు పాత పాటలను వాడారు. వాటిలో మరీ ముఖ్యంగా ఎక్కువగా వాడిన పాట సుందరీ నీవే నేనంట అనే పాట. సినిమాలో ఒకే సాంగ్ ను మూడు భాషల్లో వాడాలని ఈ సాంగ్ ను సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్. ఈ సాంగ్ తో పాటూ చిరంజీవి పాత సాంగ్స్ యురేకా సకమిక, రామ్మా చిలకమ్మా లాంటి సాంగ్స్ ను కూడా వాడారు.
పాత పాటల హక్కుల కోసం రూ. కోటి ఖర్చు
అయితే ఈ పాత సాంగ్స్ అన్నింటినీ మన శంకరవరప్రసాద్ గారులో వాడటం కోసం మేకర్స్ దానికి కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా తమ సినిమాలో వాడుకుంటే రిలీజ్ తర్వాత ఇబ్బందవుతుందని, పైగా ఇళయరాజా తన సాంగ్స్ ను వాడుకుంటే ఈ మధ్య వెంటనే కోర్టుకు వెళ్తున్నారు. ఇదంతా ఎందుకని ముందే రైట్స్ ను కొనుక్కుని ఆ పాటలను సినిమాలో వాడుకున్నారు అనిల్ రావిపూడి. అయితే ఆ పాత సాంగ్స్ ను సినిమాలో మొత్తం పాటలా వాడుకోకుండా బిట్ లుగా వాడుకున్నారు. దీని కోసం నిర్మాతలు రూ. కోటికిపైగా ఖర్చు చేశారట. కోటి రూపాయలు ఖర్చైనా సరే ఇప్పుడు సినిమాలో అవే ప్లస్ అవడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో రఫ్పాడిస్తోంది.
