OG మూవీకి బిగ్ షాక్.. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ టికెట్ రేట్లు పెంపునకు అనుమతులు ఇస్తూ తెలంగాణలో సర్కార్ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 30 Sept 2025 10:30 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ టికెట్ రేట్లు పెంపునకు అనుమతులు ఇస్తూ తెలంగాణలో సర్కార్ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని థియేటర్లలో పెంచిన ధరలకే టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
టికెట్ రేట్ల పెంపును వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ సోమవారం చెప్పింది. హై కోర్ట్ ఆర్డర్ లో ఇచ్చిన నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యాలను పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వివిధ పరిణామాలను కూడా పేర్కొన్నారు.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని పోలీసులు తెలిపారు. పెంచిన రేట్లతో టికెట్లు అమ్మొద్దని హెచ్చరించారు. తక్షణమే టికెట్ రేట్లను తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన జీవోను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీసుల వార్నింగ్ తో మంగళవారం నుంచి ఓజీ సినిమా టికెట్ రేట్లు తెలంగాణ అంతటా సాధారణ ధరలకు రానున్నాయి. అయితే సినిమాకు టికెట్ రేట్స్ పెంచడాన్ని సవాలు చేస్తూ మహేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. దాన్ని విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ జీవోను రద్దు చేస్తూ సెప్టెంబర్ 24న ఆదేశాలు జారీ చేశారు.
ఆ తర్వాత 26వ తేదీ విచారణ సమయంలో ఓజీ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 24వ తేదీన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది.
తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. సినిమా విడుదలకు ముందు.. ప్రీమియర్ ప్రదర్శనతోపాటు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
