Begin typing your search above and press return to search.

'ఓజీ' టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీ స‌ర్కారు పున‌రాలోచ‌న‌.. ఏం జ‌రిగింది?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఓజీ`.. ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా సంద‌డి చేయనుంది.

By:  Garuda Media   |   24 Sept 2025 9:04 PM IST
ఓజీ టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీ స‌ర్కారు పున‌రాలోచ‌న‌.. ఏం జ‌రిగింది?
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఓజీ`.. ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా సంద‌డి చేయనుంది. ఈ నేప‌థ్యంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు స‌హా.. వారం రోజుల పాటు అన్ని త‌ర‌హా సినిమా హాళ్ల‌లో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ఆయా ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇచ్చాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, తెలంగాణ‌, ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఓజీ ప్రీమియ‌ర్ షో ధ‌ర‌ల‌ను రూ.1000 నుంచి రూ.800మ‌ధ్య నిర్ణ‌యించారు. దీంతో చాలా చోట్ల ముంద‌స్తుగానే టికెట్ల బుకింగ్ కూడా అయిపోయింది.

రెండు రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ‌!

ఓజీ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వాలు పెంచ‌డంపై ప‌లువురు సామాజిక వేత్తలు తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టులు.. గ‌త రెండురోజులుగా విచారించి.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. క‌ర్ణాట‌క‌లో అయితే.. ప్రీమియ‌ర్ షోకు సాధార‌ణ టికెట్ ధ‌ర‌పై రూ.100 మాత్ర‌మే పెంచుకునేందుకు అవ‌కాశం ఇవ్వ‌గా.. ఇత‌ర సినిమా హాళ్ల‌లో రూ.200ల‌కు మించ‌రాద‌ని క‌ర్ణాట‌క హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇక‌, తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఓజీ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తులు ర‌ద్దు చేసింది.

వాస్త‌వానికి తెలంగాణ‌లో ఓజీ టికెట్ ధ‌ర‌ల‌ను అన్ని ప్రీమియ‌ర్ షోల‌కు రూ.800 చొప్పున నిర్ణ‌యించారు. సింగిల్ స్క్రీన్‌కు రూ.277, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.445 చొప్పున రెగ్యుల‌ర్ గా నిర్ణ‌యించారు. ఇది వారం రోజుల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొన్నారు. అయితే.. ఈ నిర్ణ‌యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేసింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇప్ప‌టికే ఏపీలో ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌రను ప్ర‌భుత్వం రూ.1000గా నిర్ణ‌యించింది. రెగ్యుల్ షోల‌పైనా ధ‌ర‌లు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే..పొరుగు రాష్ట్రాల హైకోర్టుల తీర్పుల నేప‌థ్యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించింది.