Begin typing your search above and press return to search.

OG మేకర్స్ పై పరువు నష్టం దావా.. ఏం జరిగింది?

ఆ తర్వాత మల్లేష్ గారూ.. మా అభిమానులు ఆస్వాదించినట్లే మీరు కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది.

By:  M Prashanth   |   27 Sept 2025 3:30 PM IST
OG మేకర్స్ పై పరువు నష్టం దావా.. ఏం జరిగింది?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ప్రీమియర్స్ పడగా.. గురువారం సినిమా రిలీజ్ అయింది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గ్రాండ్ గా నిర్మించింది.


అయితే తెలంగాణలో మూవీ టికెట్ రేట్ల పెంపు విషయంలో హైకోర్టులో కేసు నడుస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే సర్కార్ ఇచ్చిన జీవోపై బుధవారం సస్పెన్షన్ విధించిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌.. శుక్రవారం దాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నామని చెప్పి వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.

అదే సమయంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. "టికెట్ ధర పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అది పిటిషనర్ మల్లేష్ యాదవ్‌ కు మాత్రమే వర్తిస్తుంది. అతడికి ఏదైనా నైజాం థియేటర్‌ లో టికెట్‌ పై రూ.100 తగ్గిస్తాం" అంటూ రాసుకొచ్చింది.

ఆ తర్వాత మల్లేష్ గారూ.. మా అభిమానులు ఆస్వాదించినట్లే మీరు కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది. దీంతో ఇప్పుడు ఆ ట్వీట్ పై పిటిషనర్ మల్లేష్ స్పందించారు. పరువు నష్టం దావా వేయనున్నట్లు శనివారం తెలిపారు. ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు అందరికీ ఇచ్చిందని తెలిపారు.

తానొక్కడికే ఇచ్చిందంటూ తీర్పును తప్పుదోవ పట్టించే విధంగా ట్వీట్ చేశారని ఆరోపించారు. అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఆ ట్వీట్‌ ద్వారా అందరూ తనను ట్రోల్‌ చేసేలా ఓజీ మేకర్స్ ప్రోత్సహించారని చెప్పారు. అందుకే పరువు నష్టం దావా వేయనున్నట్టు పేర్కొన్నారు.

అయితే తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు కొన్ని రోజుల క్రితం ఆ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌ లో రూ.100, మల్టీప్లెక్స్‌ ల్లో రూ.150 పెంచుకునేందుకు సర్కార్ వీలు కల్పించింది. దీంతో మేకర్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు.

అయితే మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ స్క్రీనింగ్ ఉండగా.. మల్లేష్ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ స్టే విధించినా.. మళ్ళీ సింగిల్ బెంచ్ కి పిటిషన్ ఫార్వర్డ్ అయింది.

శుక్రవారం మధ్యాహ్నం ఇరు వర్గాల వాదనలు ముగియగా.. టికెట్‌ ధరలు పెంచడానికి వీల్లేదని మళ్లీ స్పష్టం చేసింది సింగిల్ బెంచ్. టికెట్‌ ధరలను నియంత్రించాలని వచ్చిన జీవో 120ని అమలు చేయాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చిందని, వాటికి విరుద్ధంగా మరో జీవో ఎలా జారీ చేస్తారంటూ నిలదీసింది. ఆ సమయంలోనే డీవీవీ సంస్థ ట్వీట్ చేయగా.. ఇప్పుడు పిటిషనర్ స్పందించారు.