రేట్లు పెంచి.. మళ్లీ బ్లాక్‌లో అమ్మకాలా?
ఓవైపు టికెట్ల ధరలు పెరగడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని ఓవైపు ఆవేదన వ్యక్తం చేసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే.. తమ సినిమాలకు కొంచెం క్రేజ్ కనిపించగానే అధిక రేట్ల కోసం అప్లై చేస్తారు.
By: Garuda Media | 24 Sept 2025 8:52 PM ISTఓవైపు టికెట్ల ధరలు పెరగడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని ఓవైపు ఆవేదన వ్యక్తం చేసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే.. తమ సినిమాలకు కొంచెం క్రేజ్ కనిపించగానే అధిక రేట్ల కోసం అప్లై చేస్తారు. అనుమతులు వస్తే వీలైనంతగా ప్రేక్షకుల నుంచి దండుకోవాలని చూస్తారు. గత ఏడాది ‘పుష్ప-2’ సినిమా క్రేజ్‌ను ఎలా క్యాష్ చేసుకున్నారో అందరూ చూశారు. ప్రిమియర్ షోకు ఏకంగా రూ.1200 దాకా రేటు పెట్టి టికెట్లు అమ్ముకున్నారు. రెగ్యులర్ షోలకు కూడా అసాధారణ స్థాయిలో రేట్లు వడ్డించారు. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ సినిమాకూ ఇలాగే చేశారు. కానీ అది గట్టిగా బెడిసికొట్టి సినిమాకు అంతిమంగా చేటు చేసింది. ఇప్పుడు పవన్ కొత్త సినిమా ‘ఓజీ’ క్రేజ్‌ను పూర్తిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీలో రూ.1000, తెలంగాణలో రూ.800 రేటు పెట్టి ప్రిమియర్స్ వేస్తున్నారు. ఈ రేటు ఎక్కువ అంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.
ఐతే ఫ్యాన్స్ వేలం వెర్రిని క్యాష్ చేసుకునే విషయంలో ఇంతటితో ఆగట్లేదు. హైదరాబాద్‌లో అభిమానులు ఫస్ట్ ఫస్ట్ షో చూడాలని ఎంతగానో కోరుకునే కొన్ని సింగిల్ స్క్రీన్లను సెలక్ట్ చేసుకుని వాటిని మళ్లీ మారు బేరానికి అమ్మేశారు. ఆర్టిసీ క్రాస్ రోడ్స్‌లోని మెయిన్ థియేటర్‌తో పాటు ఇంకో మూడు స్క్రీన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు స్క్రీన్లకు కలిపి ముందు రోజు నాలుగు ప్రిమియర్ షోలను ఏకంగా రూ.కోటి రేటుతో అమ్మారట. ఆ థియేటర్లకు బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో లేవు. ఆ టికెట్లను బ్లాక్‌లో పెట్టి అమ్ముకుంటున్నారు. రేటు రూ.1500 నుంచి రూ.2000 వేల వరకు పలుకుతోందట. అమ్ముడైన మేరకు ఈ రేట్లతోనే టికెట్లను సేల్ చేయిస్తున్నారు. చివరి దశలో టికెట్లు మిగిలితే.. రేటు తగ్గించి అమ్మే అవకాశముంది. ఆల్రెడీ ప్రిమియర్ షోలకు నార్మల్ రేటు కంటే నాలుగు రెట్ల ధర ఉంది. దాని మీద డబుల్, అంతకుమించి రేట్లు పెట్టి అమ్మడం అంటే ఇంతకంటే దారుణమైన దోపిడీ ఉంటుందా? అభిమానుల పిచ్చిని మరీ ఇలా క్యాష్ చేసుకోవడమా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
