ఓజి కంప్లీట్ యాక్షన్ మూవీ కాదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజి.
By: Sravani Lakshmi Srungarapu | 17 Sept 2025 1:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. అనౌన్స్‌మెంట్ నుంచే ఓజి పై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.
ఓజిలో యాక్షన్ ను మించి ఫ్యామిలీ డ్రామా
ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన హీరోయిన్ ప్రియాంక, సినిమా గురించి, పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే ఓజి సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే ఇదొక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఎంతో హైప్ ఇచ్చుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓజి సినిమా కేవలం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదని, ఇందులో యాక్షన్ ను మించి ఫ్యామిలీ డ్రామా ఉంటుందని చెప్పి అందరికీ షాకిచ్చారు.
పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం
ఫ్యామిలీ డ్రామా చుట్టూ యాక్షన్ ఓ పార్ట్ లా ఉంటుంది తప్పించి, ఓజి కంప్లీట్ యాక్షన్ డ్రామా కాదని ప్రియాంక చెప్పారు. సినిమాలో ఓజాస్ లైఫ్ ను మలుపు తిప్పే కణ్మణి పాత్రలో కనిపిస్తానని చెప్పిన ప్రియాంక, ఇప్పటివరకు తాను చేసిన పాత్రల్లో ఈ క్యారెక్టర్ తనకెంతో స్పెషల్ అని, పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడం ప్రతీ రోజూ అదృష్టంగానే భావిస్తానని ఆమె చెప్పారు.
ఇప్పుడు పవన్ మరింత బాధ్యతగా ఉంటున్నారు
ఓజి కోసం రెండున్నరేళ్లుగా వర్క్ చేస్తున్నానని చెప్పిన ప్రియాంక, ఎలక్షన్స్ లో గెలవక ముందు పవన్ ఎప్పుడు చూసినా సెట్ లో కూడా ఏదోకటి ఆలోచిస్తూనే ఉండేవారని, అస్సలు ఖాళీగా ఉండేవారు కాదని, పార్టీకి సంబంధించిన ఎవరితోనైనా మాట్లాడటం, లేదంటే పుస్తకాలు చదవడం లాంటివో చేసేవారని, ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన సంతోషంగా, ప్రశాంతంగా మరింత బాధ్యతగా కనిపిస్తున్నారని, గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త నవ్వుతున్నారని, అంత పెద్ద స్థాయిలో ఉన్నా ఆయనెప్పుడూ సింపుల్ గానే ఉంటారని, నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తుంటారని ప్రియాంక తెలిపారు.
పవన్ క్రేజ్ ను ఊహించలేకపోయా
పవన్ కళ్యాణ్ కు మంచి క్రేజ్ ఉందనే విషయం తనకు ముందే తెలుసని, కానీ ఆ క్రేజ్ ఈ స్థాయిలో ఉంటుందని తనకు తెలియదని, ఆయనతో కలిసి జర్నీ చేయడం మొదలుపెట్టాకే అసలు విషయం తెలిసిందని, ఎంత క్రేజ్, స్టార్‌డమ్, ఫేమ్ ఉన్నా ఆయన మాత్రం చాలా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతూ, అందరినీ ఒకేలా చూస్తారని, అప్పుడప్పుడు ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నప్పుడు పక్కకెళ్లి కూర్చునేదాన్నని, ఆ టైమ్ లో తనకు పుస్తకాల గురించి, పాలిటిక్స్ గురించి చెప్పేవారని ఆయన ఆన్ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ హీరోనే అని ప్రియాంక తన అభిమానాన్ని చాటుకున్నారు.
