ఓజీకి హైకోర్టు షాక్.. టికెట్ రేట్లపై స్టే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.
By: M Prashanth | 24 Sept 2025 4:53 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ముంబై మాఫియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు.
అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, ట్రైలర్‌తోనే సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ నెల 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ మరియు పాటలతో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వంటి అంశాలు కూడా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాయి.
అయితే రిలీజ్‌కు ముందు ఓజీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లేటెస్ట్ గా తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇవాళ రాత్రి 10 గంటలకు జరగాల్సిన ప్రీమియర్స్ సహా ఇప్పటికే అమ్ముడైన టికెట్లపై కూడా సందిగ్ధం నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ నిర్ణయంతో కొంత నిరాశకు గురయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్సులకు రూ.150 అదనంగా పెంచుకునే అవకాశం ఇచ్చింది. అంతేకాక స్పెషల్ ప్రీమియర్స్‌కు రూ.800 టికెట్ రేట్‌ను అనుమతించింది. కానీ హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఇక ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లకు రీఫండ్ ఇస్తారా, లేక నిర్ణయం మారుతుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఓజీ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ బెనిఫిట్ షోలకూ అనుమతి లభించడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఈ సమస్య పెద్ద ఇబ్బందిగా మారింది. రిలీజ్ సమయానికి ఏదైనా మార్పు వస్తుందా అన్నది చూడాలి. మొత్తం మీద, ఓజీకి హైకోర్టు తీర్పు పెద్ద షాక్‌గా మారింది. అయినా సినిమా మీద ఉన్న హైప్, పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
