ఓజీ టికెట్ రేట్ల పెంపు.. మేకర్స్ కు బిగ్ రిలీఫ్
ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం సినిమా టికెట్ ధరలను పెంచకూడదని ఆదేశాలు వచ్చాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు గురయ్యారు.
By: M Prashanth | 25 Sept 2025 11:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వచ్చిన బిగ్ బడ్జెట్ మాఫియా యాక్షన్ డ్రామా OG విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గురువారం రోజు ఓజీ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకున్నారు. టిక్కెట్ రేట్లు పెరిగినా కూడా ఎగబడి చూశారు. దీన్ని బట్టి సినిమాపై ఉన్న బజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కొంత వరకు టికెట్ రేట్ల పెంపు అంశం మాత్రం వివాదంగా మారింది. తెలంగాణలో ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి హఠాత్తుగా మారింది. ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం సినిమా టికెట్ ధరలను పెంచకూడదని ఆదేశాలు వచ్చాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఓజీ వంటి బిగ్ బడ్జెట్ సినిమాలు మొదటి వీకెండ్‌లోనే భారీ వసూళ్లు సాధించాలంటే ప్రీమియం టికెట్ రేట్లు కీలకం.
ఒక్కసారిగా ఈ ఆర్డర్ రావడంతో వారికి పెద్ద షాక్ తగిలింది. అయితే మేకర్స్ వెంటనే హైకోర్టులో డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ వారు ఇచ్చిన అప్పీల్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ శుక్రవారం వరకు ఊరట ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు ప్లాన్ చేసిన రీతిలో టికెట్ ధరలు అమల్లోకి వస్తాయి. కనీసం ప్రీమియర్స్, తొలి రోజుల్లో రివైజ్ చేసిన రేట్లతో మేకర్స్ ముందుకు వెళ్లే అవకాశం వచ్చింది.
ఈ తాత్కాలిక ఊరట ట్రేడ్ సర్కిల్స్‌లో ఉపశమనం కలిగించింది. మరోవైపు వసూళ్ల పరంగా సినిమా బలంగా స్టార్ట్ అవుతుందనే నమ్మకం కూడా పెరిగింది. అయితే శుక్రవారం జరిగే విచారణలో తుది తీర్పు ఏవిధంగా వస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓజీ కే కాకుండా రాబోయే ఇతర బిగ్ టికెట్ సినిమాలకు కూడా ఈ కేసు ఫలితం ప్రభావం చూపనుంది.
టికెట్ రేట్ల పెంపు అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడం తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాబట్టి భవిష్యత్తులో నిర్మాతలు, ప్రభుత్వాలు, కోర్టులు ఒకే దారిలో నడిస్తేనే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. మొత్తానికి, ఓజీ మేకర్స్‌కి తాత్కాలిక ఊరట లభించినా, తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. శుక్రవారం నాటికి ఏ తీర్పు వస్తుందోనన్న ఆతృతతో డిస్ట్రిబ్యూటర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక OG సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రీమియర్స్ తోనే రికార్డుల వర్షం కురుస్తోంది. ఇక వీకెండ్ కు టోటల్ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.
