సుజిత్ ను సర్‌ప్రైజ్ చేసిన తమన్
ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను ఎలాగైతే చూడాలని ఎదురుచూశారో సుజిత్ ఓజిలో పవన్ ను అంతే చూపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Oct 2025 1:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా సినిమా ఓజి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందునుంచే విపరీతమైన హైప్ నెలకొంది. రిలీజ్ అయ్యాక కూడా ఓజి అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి బ్లాక్‌బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓజి సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడానికి చాలానే కారణాలున్నాయి.
పవన్ నుంచి ప్రాపర్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలమవడంతో పాటూ పవన్ ఎనర్జీ, సుజిత్ స్టైలిష్ మేకింగ్, అన్నింటికీ మించి తమన్ మ్యూజిక్. ఇవన్నీ ఓజిని మంచి స్థాయిలో నిలబెట్టాయి. ఓజి నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఓజాస్ గంభీర తోనే తుఫాను సృష్టించిన తమన్, మిగిలిన సాంగ్స్ తో పాటూ తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
ఓజి సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన తమన్ మ్యూజిక్
ఇంకా చెప్పాలంటే ఓజి సక్సెస్ లో తమన్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే ఓజి సినిమాలో ఫ్యాన్స్ ను థ్రిల్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను ఎలాగైతే చూడాలని ఎదురుచూశారో సుజిత్ ఓజిలో పవన్ ను అంతే చూపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే ఫ్యాన్స్ ను సుజిత్ థ్రిల్ చేస్తే సుజిత్ ను తమన్ తన మ్యూజిక్ తో సర్‌ప్రైజ్ చేసినట్టు యంగ్ డైరెక్టర్ మొన్నామధ్య ప్రమోషన్స్ లో భాగంగా చెప్పారు.
అది సుజిత్ ఆలోచనే!
అయితే సుజిత్ ను తమన్ సర్‌ప్రైజ్ చేసింది సినిమాలో వచ్చే ట్రావెలింగ్ సోల్జర్ బీజీఎంతో. రీసెంట్ గా ఆ బీజీఎం గురించి తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఓజి సినిమాలో ఓ ఫైట్ సమయంలో తమన్ జానీ సాంగ్ తో పాటూ ట్రావెలింగ్ సోల్జర్ బీజీఎం ను కలిపి, దానికి గన్స్ సౌండ్ ను మిక్స్ చేసి కాసేపు థియేటర్లలో దడదడలాడించిన సంగతి సినిమా చూసిన అందరికీ తెలుసు. అందులో జానీ సాంగ్ ఆలోచన సుజిత్‌దేనని చెప్పిన తమన్, తనకు ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అంటే చాలా ఇష్టమని, ఆ సాంగ్ ను ప్రోగ్రామ్ చేసుకుని తన నోకియో ఫోన్ లో ఎక్కించుకుని మరీ రింగ్‌టోన్ గా పెట్టుకునే వాడినని చెప్పారు తమన్. ఆ సాంగ్ పై ఉన్న ఇష్టంతో ఏదో క్యాజువల్ గా దాన్ని జానీ సాంగ్ కు యాడ్ చేస్తే అదిరిపోయే అవుట్‌పుట్ వచ్చిందని, ఫైనల్ అవుట్‌పుట్ చూసి సుజిత్ చాలా షాకయ్యాడని తమన్ వెల్లడించారు.
