OG.. ఓవర్సీస్ సంస్థల గొడవేంటి?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 25 Sept 2025 2:52 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు. దానయ్య, కళ్యాణ్ నిర్మించిన ఆ మూవీని ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ రిలీజ్ చేసింది. అయితే కెనడాలో భారతీయ మూవీ థియేటర్ చైన్ గా ఉన్న యార్క్ సినిమాస్ కు ఆ బ్యానర్ తో వివాదం కొనసాగుతోంది.
ఇటీవల హామీకి అనుగుణంగా పని చేస్తారో లేదని యార్క్ సినిమాస్ పోస్ట్ చేయగా.. సినిమా రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది. కానీ తర్వాత ప్రాబ్లం లేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యంగిరా సంస్థ తమ సినిమాల కోసం పెంచిన అమ్మకాల గణాంకాలను అభ్యర్థించిందని యార్క్ ఆరోపించింది. దీంతో ప్రత్యంగిరా సినిమాస్ సవాలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
"ఉత్తర అమెరికాలోని సినిమా చూసే ప్రతి ఒక్కరికి గత దశాబ్దంలో తేరి, సైరా నరసింహ రెడ్డి, భీమ్లా నాయక్ సహా అనేక ఇతర సినిమాల ప్రదర్శనల సమయంలో జరిగిన దురదృష్టకర ఘటనలకు కారణమైన వ్యక్తుల గురించి తెలుసు. దక్షిణాసియా సినిమాల ఉత్తర అమెరికా పంపిణీదారులు మీతో సహకరించడానికి నిరాకరించినప్పుడల్లా స్క్రీన్లు చిరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో సినిమాల ప్రదర్శన సమయంలో నిప్పంటుకున్నాయి"
"కనీసం చెప్పాలంటే, మీరు నైతిక వ్యాపారాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. అయితే గత దశాబ్దంలో పంపిణీ వర్గంలో సినిమా ప్రేక్షకులలో అశాంతి, భయాందోళనలను సృష్టిస్తోంది. ప్రత్యంగిరా సినిమాస్.. కెనడాలో మీ సినిమాల అమ్మకాలను పెంచమని మిమ్మల్ని కోరినట్లు ఆరోపణలు చేశారు. ఏవైనా ఆధారాలు ఉంటే విడుదల చేయమని మేము మిమ్మల్ని సవాలు చేస్తున్నాం"
"మేం, మాతో సంబంధం ఉన్న పలు శక్తులు ప్రజల భద్రతకు ప్రమాదకరమని కూడా మీరు పేర్కొన్నారు. ఆ శక్తుల గురించి వివరాలు వెల్లడించాలని మేం సవాలు చేస్తున్నాం. ఇకపై మాతో కొలబరేట్ అవ్వమని చెప్పారు. ప్రత్యంగిరా సినిమాస్ అనేది అభిరుచి, విలువలు, నైతికతతో నడిచే సంస్థ. వ్యాపారాన్ని నడపడానికి అనైతిక పద్ధతులను ఉపయోగించే మీలాంటి వ్యక్తులతో మేం సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడం"
"మీ ఆగ్రహానికి గల కారణాల గురించి మాకు బాగా తెలుసు. మీ ఆరోపణలను ఎదుర్కోవడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మాకు ఇప్పుడు కెనడాలో ఒక బృందం ఉంది (సుమంత్ సుంకర నేతృత్వంలో). మీతో కొలబరేట్ అవ్వకుండా సినిమాలను ప్రదర్శిస్తాం. రాబోయే రోజుల్లో కెనడాలోని అభిమానులు, సినిమా ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమా చూసే అనుభవాన్ని అందించడానికి మేం మా సామర్థ్యం మేరకు ప్రతిదీ చేస్తాం"
"చివరగా, మీరు గతంలో చేసినట్లు, ఓజీ మూవీ ప్రదర్శన సమయంలో లేదా మా భవిష్యత్ సినిమాల ప్రదర్శన సమయంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే మీపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీ అనైతిక పద్ధతులకు మిమ్మల్ని జవాబుదారీ చేస్తాం" అని ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
