Begin typing your search above and press return to search.

ఓజీ-2 చేస్తే ఇదేనా.. కథ?

‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండు ఊపందుకుంది.

By:  Garuda Media   |   27 Sept 2025 9:45 AM IST
ఓజీ-2 చేస్తే ఇదేనా.. కథ?
X

‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండు ఊపందుకుంది. పెద్ద సినిమాలను రెండు భాగాలుగా తీయడం.. లేదా సీక్వెల్స్ చేయడం మామూలు వ్యవహారం అయిపోయింది. కానీ ఇలాంటి ప్రయత్నాల్లో చాలానే బెడిసికొట్టాయి. పార్ట్-2లు, సీక్వెల్స్‌ ప్రకటనకే పరిమితం అయ్యాయి తప్ప.. అవి కార్యరూపం దాల్చలేదు. టాలీవుడ్ లేటెస్ట్ బిగ్ మూవీ ‘ఓజీ’కి కూడా సీక్వెల్ ఉంటుందనే సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు సుజీత్.

కానీ అది కచ్చితంగా ఉంటుందనే గ్యారెంటీ ఏమీ లేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే కళ్యాణ్ ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకున్నాడు. ఉన్నవి పూర్తయితే చాలు అనే ఫీలింగ్ కలిగింది. ఇక కొత్త సినిమాల గురించి అయితే ఏమీ చెప్పలేని పరిస్థితి. కాబట్టి ‘ఓజీ-2’ ఉంటుందనే గ్యారెంటీ ఏమీ లేదు.

ఒకవేళ ‘ఓజీ-2’ తీస్తే ఆ కథ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. అందుకు తగ్గ ప్లాట్ అయితే దర్శకుడు సుజీత్ రెడీ చేసి ఉంటాడనే అనిపిస్తోంది. ‘ఓజీ’లో ఆ దిశగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు సుజీత్. ముంబయిని గడగడలాడించాక ఓజీ 15 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. అందులో ఏడేనిమిదేళ్లు అతను చెన్నైలో ఉన్నట్లు చూపిస్తారు. అక్కడే కన్మణి (ప్రియాంక మోహన్) పరిచయం అవుతుంది. అంతకంటే ముందు ఏడేళ్లు గంభీర ఎక్కడున్నాడన్నది చూపించరు. ఒక సన్నివేశంలో ఓజీ భార్య.. పెళ్లికి ముందు మీరెక్కడున్నారు, ఏం చేశారు అంటే.. జపాన్‌‌కు సంబంధించిన విజువల్స్ ఫ్లాష్‌లా మెరుస్తాయి. అంతేకాక ఓజీని పట్టుకున్న చెన్నై పోలీసులు తన బ్యాగులోంచి జపాన్‌ సంబంధిత వస్తువులను బయటికి తీయడం చూడొచ్చు.

‘ఓజీ’ ఆరంభంలో శత్రువుల చేతిలో హతమైన ఓజాస్ గురువు.. నా శిష్యుల్లో మిస్సయిన ఒక్కడు వచ్చి మీ అంతు చూస్తాడని వార్నింగ్ ఇస్తాడు. దీని ప్రకారం చూస్తే ‘ఓజీ’లో హీరో పాత్ర మిస్సయిన ఏడేళ్ల కాలాన్ని ‘ఓజీ-2’లో మెయిన్ ప్లాట్‌గా తీసుకోవడానికి అవకాశముంది. జపాన్‌కు వెళ్లి అక్కడ తన గురువును చంపిన శత్రువులను మట్టుబెట్టడం మీద స్టోరీని నడిపించే అవకాశం ఉంది. సగం వరకు ఈ కథను నడిపించి.. ఆ తర్వాత ముంబయికి తిరిగొచ్చి అక్కడ మళ్లీ పురుడు పోసుకున్న మాఫియాను ఎదుర్కోవడం మీద మిగతా కథను కొనసాగించవచ్చు. ఓజీ-2 అంటూ చేస్తే కథ ఇలాగే నడిచే అవకాశాలున్నాయి.