యువజంట సీక్రెట్ ప్రేమ గుట్టు రట్టు!
అయితే ఇటీవలే బాలీవుడ్ లో అద్భుతమైన ప్రేమకథా చిత్రంలో నటించి బంపర్ హిట్ కొట్టడమే గాక, ఆ ఇద్దరూ వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
By: Sivaji Kontham | 22 Sept 2025 8:15 AM ISTసినిమా సెట్లో ఉండగా ప్రేమలో పడటం, అటుపై కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని తర్వాత ఏదో ఒక రోజు వాగ్వాదంతో విడిపోవడం ఇవన్నీ రెగ్యులర్ గా చూసే వ్యవహారాలే. తారల మధ్య ప్రేమ కథలు నీటి బుడగల్లా పేలుతున్నాయి. కానీ అరుదుగా కొన్ని జంటలు మాత్రం పెళ్లి వరకూ వెళ్లడం, లైఫ్ లో గొప్ప ఆదర్శ జంటగా నిలబడటం కూడా చూస్తున్నాం.
అయితే ఇటీవలే బాలీవుడ్ లో అద్భుతమైన ప్రేమకథా చిత్రంలో నటించి బంపర్ హిట్ కొట్టడమే గాక, ఆ ఇద్దరూ వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ ఇద్దరూ ప్రేమకథా చిత్రంలో అద్బుతమైన కెమిస్ట్రీ పండించడానికి ముఖ్య కారణం... ఆఫ్ ద స్క్రీన్ కూడా ఒకరితో ఒకరు ప్రేమలో ఉండటమేనని తెలిసింది. ఈ జంట నిండా ప్రేమలో మునిగారు. దాని కారణంగా తెరపై ప్రేమికులుగా జీవించేసారు. దీంతో ఈ సినిమా కూడా ప్రజలకు అంతే బాగా నచ్చేసింది. ముఖ్యంగా ఆ ఇద్దరి నడుమా అద్భుతమైన కెమిస్ట్రీకి ప్రశంసలు కురిసాయి.
ఈ యువజంట సెట్లో ప్రేమలో ఉన్నారని తెలిసినా కానీ నిర్మాత దీనిని బయటపెట్టవద్దని సూచించిన కారణంగానే యువజంట జాగ్రత్త పడిందని తెలిసింది. కెరీర్ ఆరంభమే ప్రేమ- డేటింగ్ వ్యవహారాల గురించి బయటపడితే అది కెరీర్ కి ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఈ జంట ఇప్పటివరకూ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టలేదని చెబుతున్నారు. ఆసక్తికరంగా ఈ యువహీరో ప్రముఖ సినీకుటుంబానికి చెందిన వ్యక్తి కాగా. ఆ అమ్మాయి ఒక కంపెనీలో హెచ్.ఆర్ గా పని చేయడానికి దరఖాస్తు చేసుకున్న మధ్యతరగతి యువతి కావడం విశేషం. సినీకుటుంబానికి చెందని అమ్మాయితో ప్రతిభావంతుడైన నెపో కిడ్ ప్రేమలో పడటం ఆసక్తిని కలిగిస్తోంది.
