నటీనటులను టార్గెట్ చేస్తే అకౌంట్లు బ్యాన్!
డిజిటల్ యుగంలో వెబ్ సిరీస్‌లకు.. అందులోని పాత్రలకు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు.
By: Srikanth Kontham | 13 Jun 2026 5:00 PM ISTడిజిటల్ యుగంలో వెబ్ సిరీస్‌లకు.. అందులోని పాత్రలకు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే కొన్నిసార్లు రీల్ జీవితానికి- రియల్ జీవితానికి మధ్య ఉన్న గీతను మర్చిపోయి నటీనటులపై వ్యక్తిగత విమర్శలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా ప్రముఖ వెబ్ సిరీస్ `ఆఫ్-క్యాంపస్ రెండవ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఆ సిరీస్ నిర్మాణ బృందం నటీనటుల రక్షణ కోసం కీలకమైన ప్రకటన చేసింది. తమ కాస్టింగ్ పై జరుగుతున్న లక్షిత వేధింపులను ఖండించి సోషల్ మీడియా వేదికగా బహిరంగ హెచ్చరికను జారీ చేసింది.
ఈ సిరీస్ సరికొత్త ఎపిసోడ్‌లు విడుదలవుతున్న కొద్దీ కథలోని కొన్ని పాత్రల ప్రవర్తనను తట్టుకోలేక కొందరు నెటిజన్లు సదరు నటీనటుల సోషల్ మీడియా ఖాతాలలో అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు దిగుతున్నట్లు మేకర్స్ గమనించారు. తెరపై కనిపించే పాత్రల స్వభావాన్ని బట్టి నిజ జీవితంలో నటులను జడ్జ్ చేయడం , వారిని మానసికంగా వేధించడం ఎంతమాత్రం భావ్యం కాదని చిత్ర యూనిట్ హితవు పలికింది.
ఈ విధమైన ప్రవర్తన నటీనటుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆఫ్-క్యాంపస్ బృందం హెచ్చరించింది. తమ అధికారిక కమ్యూనిటీ పేజీలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో నటీనటులను .. తోటి అభిమానులను వేధించే వారి అకౌంట్లను తక్షణమే తొలగిస్తామని స్పష్టం చేసింది.
సైబర్ బుల్లీయింగ్‌కు వ్యతిరేకంగా తాము జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నామని.. అవసరమైతే చట్టప రమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని నిర్మాణ సంస్థ తేల్చిచెప్పింది. కథ , పాత్రలపై ఆరోగ్యక రమైన చర్చలను తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు తమ అభిప్రాయాలను, విమర్శలను గౌరవప్రదమైన పరిధిలో పంచుకోవాలని కోరారు. ఒక సిరీస్‌ను విజయవంతం చేయడం వెనుక నటీనటుల కష్టం ఎంతో ఉంటుందని కథలోని నెగిటివ్ పాత్రలను చూసి నిజ జీవితంలో వారిపై ద్వేషాన్ని పెంచుకోవడం సరికాదని హితవు పలికారు.
అభిమానులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. సాధారణంగా పాపులర్ వెబ్ సిరీస్‌లు.. డ్రామాలలో నటీనటులు తమ పాత్రల్లో లీనమై జీవించినప్పుడు, ప్రేక్షకులు ఆ పాత్రలను నిజమని నమ్మి భావోద్వేగానికి గురికావడం సహజం. గతంలో కూడా పలు అంతర్జాతీయ సిరీస్‌ల విలన్ పాత్రధారులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా `ఆఫ్-క్యాంపస్` టీమ్ సీజన్ 2 ఆరంభంలోనే ఈ విధమైన ముందస్తు హెచ్చరికలు చేయడంతో టీమ్ భద్రతకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నామో నిరూపిం చుకుంది.
వినోదం అనేది కేవలం ఆనందించడానికి మాత్రమే. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని నరకంగా మార్చడానికి కాదు. `ఆఫ్-క్యాంపస్’`బృందం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో నటీనటులకు రక్షణ కల్పించడంలో మంచి పరిణామం. ప్రేక్షకులు కూడా పరిణతితో వ్యవహరించి నటనను ఒక కళగా మాత్రమే గుర్తించినప్పుడే ఇలాంటి సైబర్ వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది.
