ఆదర్శకుటుంబం- రణబాలి మధ్యలో జైలర్ హంగామా! అక్టోబర్ మాసంలో ఎవరిది పై చేయి?
ఈ అక్టోబర్ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత రసవత్తరంగా మారనుంది.
By: Sivaji Kontham | 1 Oct 2026 6:21 PM ISTఈ అక్టోబర్ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత రసవత్తరంగా మారనుంది. ఒకే సమయంలో పలువురు స్టార్ హీరోల చిత్రాలు బరిలో దిగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో - సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `జైలర్ 2` అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో ఇటు తెలుగు స్టార్లు నటించిన సినిమాలపై దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ చిత్రానికి సరిగ్గా వారం రోజుల ముందు, అంటే అక్టోబర్ 9న విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న `ఆదర్శ కుటుంబం` సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ నటిస్తున్న `రణబాలి` చిత్రం కూడా అక్టోబర్ 16న అంటే రజినీ సినిమా విడుదలైన మరుసటి రోజే బరిలోకి దిగుతుండటం గమనార్హం. వెంకీ మామ, రౌడీ హీరో సినిమాల మధ్యలో సూపర్‌స్టార్ జైలర్ హంగామా షురూ కావడంతో ఈ పోటీ మరింత రంజుగా మారింది.
పెద్ద స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడినప్పుడు కలెక్షన్లపై కొంత ప్రభావం పడటం సహజం. వెంకటేష్ `ఆదర్శ కుటుంబం` చిత్రానికి మొదటి వారం సోలో రన్ దక్కే అవకాశం ఉన్నా.. రెండో వారంలో `జైలర్ 2` ఎంట్రీతో కలెక్షన్ల షేరింగ్ .. థియేటర్ల సర్దుబాటు తప్పకపోవచ్చు. సినిమాకు కనుక మొదటి రోజే బలమైన పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే గరిష్ట వసూళ్లను రాబట్టుకోవడానికి ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది.
ఇక విజయ్ దేవరకొండ `రణబాలి` విషయానికి వస్తే... రజినీకాంత్ `జైలర్ 2` విడుదలైన సరిగ్గా ఒక్క రోజు తేడాతో (అక్టోబర్ 16న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం కొద్దిగా సవాల్‌తో కూడుకున్న విషయమే. సూపర్‌స్టార్ క్రేజ్ ఉన్న మాస్ సినిమాతో పోటీ పడటం వల్ల థియేటర్ల ఎంపికలో.. కలెక్షన్ల పరంగా కొంత షేరింగ్ తప్పకపోవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు మన సినిమాలకు తగిన ప్రాధాన్యతనిచ్చి ప్రైమ్ థియేటర్లను కేటాయిస్తే ఈ ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేస్తోంది గనుక జైలర్ 2 కి మంచి థియేటర్లు పడే అవకాశం ఉంటుంది. అది రజనీ బాక్సాఫీస్ మానియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ సినిమా ఐమ్యాక్స్ రిలీజ్ ని ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తుండడం ఉత్కంఠను పెంచుతోంది.
ఏది ఏమైనా.. కంటెంట్ బలంగా ఉండి సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ హీరో సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో సందేహం లేదు. కుటుంబ ప్రేక్షకులలో వెంకటేష్‌కు.. మాస్ ఆడియన్స్‌లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌తో పాటు.... రజినీకాంత్ బాక్సాఫీస్ సునామీ అన్నీ కలిసి ఈ అక్టోబర్ సీజన్‌ను టాలీవుడ్‌లో మోస్ట్ వైబ్రెంట్‌గా మార్చబోతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
