Begin typing your search above and press return to search.

టాలీవుడ్ 'అక్టోబర్'.. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

2025లో అప్పుడు 9 నెలలు కంప్లీట్ అయ్యాయి. ఇటీవల అక్టోబర్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

By:  M Prashanth   |   4 Oct 2025 11:52 AM IST
టాలీవుడ్ అక్టోబర్.. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?
X

2025లో అప్పుడు 9 నెలలు కంప్లీట్ అయ్యాయి. ఇటీవల అక్టోబర్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్ని అనూహ్యంగా హిట్స్ గా నిలిచాయి. మరిన్ని భారీ అంచనాల మధ్య వచ్చి విఫలమయ్యాయి. ఇంకొన్ని ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోయాయి.

అయితే ఈ ఏడాది వేసవిలో అనుకున్నంత రేంజ్ లో సినిమాలు ఆడలేదు. ఆ తర్వాత ఆగస్టులో వచ్చిన సినిమాలు.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకోలేదు. కానీ గత నెలలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. సెప్టెంబర్ 2025.. టాలీవుడ్ లో అత్యధిక ప్రాఫిట్స్ ఇచ్చిన నెలగా నిలిచిందనే చెప్పాలి.

లిటిల్ హార్ట్స్ మూవీతో సెప్టెంబర్ దూకుడు మొదలవ్వగా.. ఓజీ సినిమాతో ఎండ్ అయింది. చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్.. భారీ వసూళ్లను రాబట్టింది. రూ.35 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మిరాయ్, కిష్కింధపురి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్స్ గా నిలిచాయి.

వరల్డ్ వైడ్ గా మిరాయ్ మూవీ.. ఇప్పటివరకు రూ.150 కోట్లు సాధించి అదరగొట్టింది. కిష్కింధపురి కూడా సాలిడ్ కలెక్షన్స్ సాధించి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఓజీ మూవీ.. రూ.250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి.. రూ.300 కోట్లకు చేరువలో ఉంది. దీంతో సెప్టెంబర్ నెల అంతా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షమనే చెప్పాలి.

అదే సమయంలో ఇప్పుడు అక్టోబర్.. కాంతార చాప్టర్ 1 మూవీతో సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయింది. ఆ సినిమాకు ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రాగా.. ఇప్పుడు దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుండగా.. బాక్సాపీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో సందడి చేస్తోంది. అక్టోబర్ ను విజయవంతంగా ప్రారంభించింది.

అయితే అక్టోబర్ లో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుసు కదా, కె- ర్యాంప్, డ్యూడ్, మిత్ర మండలి సహా మాస్ జాతర చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో అక్టోబర్ లో సెప్టెంబర్ సక్సెస్ ఫుల్ సీన్ రిపీట్ అవుతుందేమో అంతా వేచి చూడాలి.