అక్టోబర్ 2 బాక్సాఫీస్.. ఎవరి లెక్కలూ సేఫ్ కాదే!
మొదటి రోజు పడే హడావుడి ఓపెనింగ్స్ కంటే, వీకెండ్ వరకు నిలబడే సత్తా ఎవరి కంటెంట్‌లో ఉందన్నదే ఇక్కడ అసలైన సవాలుగా మారింది.
By: M Prashanth | 30 Sept 2026 10:17 AM ISTపండగ సెలవులకు సినిమాలు క్యూ కట్టడం నార్మల్ అయినా, ఈసారి గాంధీ జయంతి బరిలో దిగుతున్న ప్రాజెక్టుల వెనుక లెక్కలు మాత్రం చాలా చిత్రంగా ఉన్నాయి. ఒక సినిమాకు భారీ స్టార్ లేడు, ఇంకో హీరోకి తెలుగులో సోలో మార్కెట్ ఇంకా ప్రూవ్ కాలేదు, మరొకటి పక్క భాషలో రివ్యూలు తెచ్చుకుని వస్తోంది. వీటికి తోడు పోయిన వారం రిలీజైన ‘ది ప్యారడైజ్’ కూడా స్క్రీన్లపై నడుస్తూనే ఉంది. మొదటి రోజు పడే హడావుడి ఓపెనింగ్స్ కంటే, వీకెండ్ వరకు నిలబడే సత్తా ఎవరి కంటెంట్‌లో ఉందన్నదే ఇక్కడ అసలైన సవాలుగా మారింది.
ఈ రేసులో మొదటగా కనిపిస్తోంది ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. పుష్పతో ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో మంచి ఇమేజ్ వచ్చింది కానీ, టికెట్లు తెంచే సోలో హీరోగా ఎంతవరకు లాగుతాడనేది ఇంకా డౌటే. మ్యాజిక్, జీనీ చుట్టూ తిరిగే సోషియో ఫాంటసీ సెటప్ కాబట్టి దీనికి మొదటి రోజు కన్నా ఫ్యామిలీస్ నుంచి వచ్చే మౌత్ టాక్ చాలా కీలకం. తెలుగు, తమిళం, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేస్తుండటంతో అన్ని భాషల నుంచి మినిమం టాక్ పడితేనే బడ్జెట్ సేఫ్ అవుతుంది.
మరోవైపు సందీప్ కిషన్ ‘సిగ్మా’కు ఎదురవుతున్న ఛాలెంజ్ వేరు. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్, రూ.500 కోట్ల హీస్ట్ రాబరీ లైన్, U/A సెన్సార్ బోర్డుతో వస్తున్న ఈ సినిమా యూత్‌ను టార్గెట్ చేస్తోంది. తమిళంలో విజయ్ పేరుతో బజ్ ఉన్నా, తెలుగులో మాత్రం సందీప్ కిషన్ మార్కెట్, ట్రైలర్ కట్ మాత్రమే ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేయాలి. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తోడైనప్పటికీ, కంటెంట్ ఏమాత్రం రొటీన్‌గా అనిపించినా ఇక్కడి ఆడియన్స్ లైట్ తీసుకునే ప్రమాదం ఉంది.
ఇక కీర్తి సురేష్ ‘డోరతి’ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఇప్పటికే తమిళంలో రిలీజై కాస్త బోల్డ్ కంటెంట్, మిక్స్‌డ్ టాక్‌తో నెట్టింట రకరకాల చర్చలు నడిపించింది. ఇప్పుడు రానా స్పిరిట్ మీడియా ద్వారా తెలుగులోకి తెస్తున్నారు. అంటే కొత్త సినిమా అనే క్యూరియాసిటీ కంటే, ముందే తెలిసిన టాక్ తెలుగు ఆడియన్స్‌ను థియేటర్ల వరకు ఎంతవరకు రప్పిస్తుందనేది ప్రశ్న. దీనికి 'A' సర్టిఫికెట్ పడటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ సహజంగానే దూరంగా ఉంటారు.
వీటి మధ్యలోనే ‘అనకాపల్లి’, ‘తెల్ల కాగితం’ లాంటి చిన్న ప్రాజెక్టులు కూడా సైలెంట్‌గా థియేటర్లలోకి దిగుతున్నాయి. హర్ష్ రోషన్, నక్షత్ర కాంబినేషన్‌లో వస్తున్న ‘తెల్ల కాగితం’ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందింది. పెద్ద సినిమాల నడుమ స్క్రీన్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇలాంటి చిన్న సినిమాలకు మొదటి ఆట నుంచే పాజిటివ్ వైబ్ వస్తే వీకెండ్‌కు ఆటోమేటిక్‌గా షోలు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
‘అనకాపల్లి’కి మరో ప్లస్ పాయింట్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ అవుతుండటం. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాణంలో భాగమై కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు. పెద్ద స్టార్ లేకపోయినా, రిలీజ్‌కు ముందే కొన్ని స్పెషల్ స్క్రీనింగ్స్ వేయడం ద్వారా కంటెంట్ మీద టీమ్ నమ్మకం చూపిస్తోంది.
అక్టోబర్ 2న ఏ ఒక్కరికీ సులువైన విజయం దక్కేలా లేదు. ఫహాద్‌కు ఫ్యామిలీ టాక్ కావాలి, సందీప్‌కు యూత్ సపోర్ట్ నిలబడాలి, కీర్తి సురేష్‌కు మిక్స్‌డ్ టాక్ దాటి టికెట్లు తెగాలి, చిన్న సినిమాలు మౌత్ టాక్‌ను ఒడిసిపట్టుకోవాలి. గాంధీ జయంతి సెలవు రోజు అందరికీ కాస్తో కూస్తో కలెక్షన్లు రావచ్చు. కానీ అసలైన ఆట మొదలయ్యేది శుక్రవారం నుంచే.. అప్పుడే ఎవరి స్క్రీన్లు పెరుగుతాయి, ఎవరివి ఖాళీ అవుతాయో తేలిపోతుంది.
