7 కోట్ల బడ్జెట్ మూవీ.. 'దురంధర్'ని మించిన బ్లాక్ బస్టర్!
2026 ప్రపంచ సినిమా రంగానికి ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ సినిమాలు అంచనాలకు మించి రాణిస్తున్నాయి.
By: Sivaji Kontham | 26 May 2026 11:10 AM IST2026 ప్రపంచ సినిమా రంగానికి ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ సినిమాలు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారతదేశంలో సంచలనం సృష్టించిన `ధురంధర్ 2`తో పాటు హాలీవుడ్‌లో మైఖేల్, ప్రాజెక్ట్ హైల్ మేరీ, ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ వంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ నాలుగు ప్రతిష్టాత్మక చిత్రాలు సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్ల(23 వేల కోట్ల రూపాయల)కు పైగా వసూళ్లను సాధించాయి. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది అత్యధిక లాభాలను ఆర్జించిన సినిమాగా రికార్డు కెక్కలేకపోయింది. ఆ అరుదైన ఘనతను థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తూ.. తన బడ్జెట్‌కు ఏకంగా 100 రెట్లు లాభాలను తెచ్చిపెట్టిన ఒక చిన్న స్వతంత్ర (ఇండీ) చిత్రం సొంతం చేసుకుంది.
రచయిత - దర్శకుడు కర్రీ బార్కర్ సరికొత్తగా తెరకెక్కించిన స్వతంత్ర హారర్ చిత్రం `అబ్సెషన్` ఈ ఏడాది థియేటర్ల వద్ద అతిపెద్ద సక్సెస్ స్టోరీగా అవతరించింది. కొత్తవారితో అత్యంత పరిమితమైన వనరులతో కేవలం 750K డాలర్ల (సుమారు రూ.7 కోట్లు) అల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల ప్రారంభంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ తన జోరును పెంచుకుంటూ పోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 80 మిలియన్ డాలర్ల (రూ.750 కోట్లకు పైగా) వసూళ్లను రాబట్టింది. సినిమా పరిశ్రమలో ఒక చిన్న చిత్రం ఏకంగా 10,000 శాతానికి పైగా లాభాలను అర్జించడం ఈ ఏడాదిలోనే అతిపెద్ద రికార్డుగా నమోదైంది.
థియేటర్లలో విడుదలై కేవలం పది రోజులు దాటినా `అబ్సెషన్` వసూళ్ల వేగం తగ్గకపోగా మరింత పుంజుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర అమెరికాలో మొదటి వారాంతంలో 16 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండవ వారాంతానికి వచ్చేసరికి 22 మిలియన్ డాలర్లను రాబట్టింది. పరిమిత థియేటర్లలోనే విడుదలైనా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ దీని హవా కొనసాగుతోంది. అక్కడ ఇప్పటికే 21 మిలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా త్వరలోనే 100 మిలియన్ డాలర్ల మార్కును దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇదే గనుక జరిగితే సినీ చరిత్రలో `పారానార్మల్ యాక్టివిటీ, `ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్` చిత్రాల తర్వాత.. ఒక మిలియన్ డాలర్ కంటే తక్కువ బడ్జెట్‌తో రూపొంది 100 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మూడవ చిత్రంగా `అబ్సెషన్` సరికొత్త చరిత్ర సృష్టించనుంది.
ఈ చిన్న చిత్రం భారీ బడ్జెట్ సినిమాలైన మైఖేల్, ప్రాజెక్ట్ హైల్ మేరీల రికార్డులను తిరగరాయడం విశేషం. కేవలం 1 మిలియన్ డాలర్ కంటే తక్కువ ఖర్చుతో నిర్మితమైన `అబ్సెషన్` ఇప్పటికే 100 రెట్ల లాభాన్ని చూసింది. దీనికి విరుద్ధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చిన `మైఖేల్` చిత్రం ఇప్పటివరకు 788 మిలియన్ డాలర్లను వసూలు చేసినా.. అది దాని బడ్జెట్‌కు కేవలం 5 రెట్లు మాత్రమే. అలాగే `ప్రాజెక్ట్ హైల్ మేరీ` 675 మిలియన్ డాలర్లతో తన బడ్జెట్‌కు 3 రెట్లు మాత్రమే లాభాన్ని తెచ్చింది. హాలీవుడ్ యేతర చిత్రాలలో చైనీస్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం తన 40 మిలియన్ డాలర్ల బడ్జెట్‌కు 16 రెట్లు (650 మిలియన్ డాలర్లు) వసూలు చేయగా... బాలీవుడ్ యాక్షన్ చిత్రం `ధురంధర్ 2` 12 మిలియన్ డాలర్ల బడ్జెట్‌కు 17 రెట్లు (200 మిలియన్ డాలర్లు) ఆర్జించింది. వీటన్నిటితో పోలిస్తే అబ్సెషన్ బడ్జెట్ పరంగా చాలా చిన్నదైనా.. లాభాల శాతంలో వాటన్నింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.
కర్రీ బార్కర్ స్వయంగా కథ, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహించిన ఈ `అబ్సెషన్` చిత్రంలో మైఖేల్ జాన్‌స్టన్ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో ఆయన ఒక మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి అయిన `బేర్` అనే పాత్రలో కనిపిస్తారు. అతడు తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండే నవారెట్) తనతో ప్రేమలో పడాలని కోరుకుంటూ ఒక అద్భుత శక్తులున్న అతీంద్రియ బొమ్మను కొనుగోలు చేస్తాడు. అయితే ఆ కోరిక ఎలాంటి భయానక పరిణామాలకు దారితీసిందనే కథాంశంతో ఈ హారర్ చిత్రం రూపొందింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ ప్రదర్శన పూర్తి చేసుకుని మే 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సానుకూల సమీక్షలతో అద్భుతమైన ప్రజాదరణతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
