మొదటి రోజు 1.60 కోట్లు.. ఆ తరువాత బిగ్ ట్విస్ట్!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సాధారణంగా హాలీవుడ్ సినిమాలు మంచి వసూళ్లు సాధించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల విడుదలైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By: M Prashanth | 8 Jun 2026 11:28 AM ISTఇండియన్ బాక్సాఫీస్ వద్ద సాధారణంగా హాలీవుడ్ సినిమాలు మంచి వసూళ్లు సాధించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల విడుదలైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా భారత్ లో అనూహ్యమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మే చివర్లో విడుదలైన ఆ సినిమా తొలి రోజు నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తొలి వారంలో భారీ వసూళ్లు సాధించిన ఆ చిత్రం, రెండో వారంలో కూడా అదే జోరు కంటిన్యూ చేయడం విశేషం. ముఖ్యంగా రెండవ శనివారం నమోదైన వసూళ్లు ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు ఇండియాలో 1.60 కోట్లు అందుకున్న ఈ సినిమా 9వ రోజు 8 కోట్లకు చేరడం బిగ్ ట్విస్ట్.
సాధారణంగా హాలీవుడ్ హారర్ చిత్రాలకు మొదటి వారం తర్వాత కలెక్షన్లు తగ్గే పరిస్థితి కనిపిస్తుంటుంది. కానీ అబ్సెషన్ విషయంలో అందుకు భిన్నమైన ట్రెండ్ కనిపించింది. అయితే అబ్సెషన్ విజయానికి ప్రధాన కారణాల్లో సోషల్ మీడియా ప్రమోషన్స్ ముందువరుసలో నిలుస్తోంది. ఎందుకుంటే సినిమా విడుదలైన కొద్ది రోజులకే కొన్ని సీన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా యూత్ లో ఆ సినిమాపై ఆసక్తి పెరగడానికి డిజిటల్ ప్రమోషన్ కీలక పాత్ర పోషించినట్లు క్లియర్ గా తెలుస్తోంది.
అలాగే ఆ చిత్ర దర్శకుడికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కూడా సినిమాకు ప్లస్ గా మారింది. ఇప్పటికే ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ లో ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తెరకెక్కించిన సినిమా కావడంతో యూత్ ఆడియన్స్ ఆసక్తిగా థియేటర్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఏర్పడిన ఆ క్రేజ్ ఓపెనింగ్స్ కు హెల్ప్ అయిందని చెప్పాలి. దీంతో ఇండియాలో బాక్సాఫీస్ దగ్గర లెక్క 50 కోట్లకు దగ్గరవుతోంది.
ఇక మరో ముఖ్యమైన రీజన్ మౌత్ టాక్. సినిమా చూసిన ప్రేక్షకులు తమ ఎక్స్పీరియన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం, ఫ్రెండ్స్ కు సజ్జెస్ట్ చేయడం వల్ల మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మూవీ చూశారు. హారర్ చిత్రాల్లో హారర్ ఎలిమెంట్స్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకుల మధ్య చర్చ ఎక్కువగా జరుగుతుంది. అబ్సెషన్ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపించింది.
టికెట్ ధరలు కూడా సినిమా సక్సెస్ కు హెల్ప్ అయ్యాయి. అందుబాటులో ఉండే ధరలతో టికెట్లు సేల్ చేయడంతో అనేకమంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎక్కువ రేట్ల కారణంగా ప్రేక్షకులు వెనక్కి తగ్గే పరిస్థితి చిత్రానికి పెద్దగా కనిపించలేదని చెప్పాలి. అయితే అన్నింటికంటే ముఖ్యమైన కారణం హారర్ జానర్ కు ఇండియాలో పెరుగుతున్న క్రేజ్.
గత కొన్నేళ్లుగా హారర్ స్టోరీలతో తెరకెక్కిన సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా సైకలాజికల్ హారర్ కథలకు యూత్ ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఒక హాలీవుడ్ మూవీ.. కంటెంట్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఎఫెక్ట్, పాజిటివ్ టాక్, హారర్ జానర్ కు ఉన్న డిమాండ్ కలిసివచ్చినప్పుడు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమా విజయం సాధించగలదని అబ్సెషన్ మరోసారి ప్రూవ్ చేసింది.
