ఇండియా హారర్ చిత్రాల్లో సరికొత్త రికార్డు!
హాలీవుడ్‌లో అప్పుడప్పుడు అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన స్వతంత్ర చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంటాయి.
By: Srikanth Kontham | 24 Jun 2026 12:30 PM ISTహాలీవుడ్‌లో అప్పుడప్పుడు అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన స్వతంత్ర చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంటాయి. భారీ గ్రాఫిక్స్, అగ్ర నటీనటులు లేకపోయినా? బలమైన కథాంశంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించొచ్చని నిరూపించిన తాజా చిత్రం `అబ్సెషన్`. ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా భారతీయ సినీ మార్కెట్‌లో సైతం ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా కథాంశం సాధారణ హర్రర్ చిత్రాలకు భిన్నంగా, మానసిక సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది.
ఒక మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే యువకుడు చిన్ననాటి స్నేహితురాలిని అమితంగా ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరచలేక, ఒక రహస్య క్రిస్టల్ షాపులో దొరికే వింత వస్తువు సహాయంతో ఆమె తనను ప్రాణంగా ప్రేమించాలని ఓ కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరినప్పటికీ అది ఎంతటి భయానకమైన, విషాదకరమైన పరిణామాలకు దారితీసిందనే అంశాన్ని మేకర్స్ ఎంతో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. భారతదేశంలో హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. కానీ `అబ్సెషన్` సాధించిన విజయం సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఇక్కడ ఏకంగా 78.60 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించి భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన ఇంగ్లీష్ హర్రర్ చిత్రంగా నిలిచింది. ఈ స్థాయి స్పందన వస్తుందని తాము అస్సలు ఊహించలేదని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. భారతీయ ప్రేక్షకులు చిత్రంలోని ఉత్కంఠను .. భావోద్వేగాలను ఎంతగానో ఆస్వాదించారనడానికి ఈ వసూళ్లే నిదర్శనం. ఈ సినిమా సాధించిన లాభాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కేవలం 750,000 డాలర్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన చిత్రం అంతర్జాతీయంగా 250 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి గ్లోబల్ ఫినామినన్‌గా అవతరించింది.
నేటి కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు సైతం బోల్తా పడుతున్న తరుణంలో కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారని ఈ సినిమా విజయం మరోసారి నిరూపించింది. ఈ చిత్ర విజయం వెనుక 26 ఏళ్ల యువ దర్శకుడు కర్రీ బార్కర్ ప్రతిభ దాగి ఉంది. తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న బార్కర్ సడన్ పాపులారిటీ పట్ల కొంత అప్రమత్తంగా ఉన్నాడు. హాలీవుడ్ పెద్ద స్టూడియోల నుండి అవకాశాలు వస్తున్నప్పటికీ తన సృజనాత్మక స్వేచ్ఛను కోల్పోకూడదని భావిస్తున్నాడు. ఇతరుల కోసం కాకుండా తన అంతరాత్మకు నచ్చిన విధంగా సినిమాలు తీస్తేనే ఇలాంటి విలక్షణమైన చిత్రాలు పుట్టుకొస్తాయని నమ్ముతున్నాడు.
కేవలం భయపెట్టే సన్నివేశాలకే పరిమితం కాకుండా సమాజంలోని ఒంటరితనం, విషపూరిత బంధాలు, పురుషుల ఆధిపత్య ధోరణి .. వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం వంటి లోతైన సామాజిక అంశాలను ఈ చిత్రం స్పృశించింది. భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్త యువత ఈ అంశాలకు కనెక్ట్ అవ్వడమే విజయానికి అసలైన కారణం. భావోద్వేగాలను భయంతో ముడిపెట్టి చెప్పిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తోంది.
