Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ స్టార్‌కు అవ‌మానం..లైట్ అన్న డైరెక్ట‌ర్‌!

అయితే ఈవెంట్ స్టార్ట్ చేయ‌డానికి టీమ్ నానా ప‌టేక‌ర్‌ని గంట పాటు వెయిట్ చేయించార‌ట‌.

By:  Tupaki Entertainment Desk   |   22 Jan 2026 2:00 PM IST
సీనియ‌ర్ స్టార్‌కు అవ‌మానం..లైట్ అన్న డైరెక్ట‌ర్‌!
X

గ‌త కొంత కాలంగా త‌న‌ అస్తిత్వాన్ని కాపాడుకోవ‌డం కోసం ఫైట్ చేస్తున్న బాలీవుడ్ ఇప్పుడు కొత్త బాట ప‌ట్టింది. హింసత్మ‌క సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని మ‌ళ్లీ స‌క్సెస్ బాట‌ప‌డుతూ త‌న స్థానాన్ని కాపాడుకోవాల‌నుకుంటోంది. సౌత్‌పై గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా డామినేష‌న్‌ని కొన‌సాగించిన బాలీవుడ్ గ‌త కొంత కాలంగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయి అస్తిత్వం కోసం ప్ర‌యాస ప‌డుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే కొత్త త‌ర‌హా యాక్ష‌న్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

సౌత్ డైరెక్ట‌ర్‌ల ఫార్ములాని ఫాలో అవుతూ హిసాత్మ‌క సినిమాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఓ రోమియో`. షాహీద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో సీనియ‌ర్ స్టార్, వెర్స‌టైల్ ఆర్టిస్ట్ నానా ప‌టేక‌ర్, త‌మ‌న్నా, దిషా ప‌టానీ, ఫ‌రీదా జ‌లాల్‌, అరుణ ఇరానీ న‌టిస్తున్నారు. విక్రాంత్ మెస్సే కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని హుస్సేన్ జైదీ రాసిన‌ `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి` బుక్ ఆధారంగా ద‌ర్శ‌కుడు విశాల్ భ‌ర‌ద్వాజ్ రూపొందిస్తున్నారు.

`మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి` న‌వ‌ల నుంచే సంజ‌య్ లీలా భ‌న్సాలీ `గంగూబాయి క‌తియావాడి`ని రూపొందించాడు. ఇప్పుడు ఇదే న‌వ‌ల ఆధారంగా `ఓ రోమియో` రూపొందుతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇండిపెండెన్స్ అనంత‌రం ముంబాయిలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్ సాజిద్ న‌దియా వాలా ప్లాన్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఈ మూవీ ట్రైల‌ర్‌ని బుధ‌వారం ముంబాయిలో టీమ్ రిలీజ్ చేసింది. ఇందు కోసం ఓ భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌కు ద‌ర్శ‌కుడు విశాల్ భ‌ర‌ద్వాజ్‌తో పాటు నానా ప‌టేక‌ర్‌, షాహీద్ క‌పూర్‌, త్రిప్తి దిమ్రీ.. త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అయితే ఈవెంట్ స్టార్ట్ చేయ‌డానికి టీమ్ నానా ప‌టేక‌ర్‌ని గంట పాటు వెయిట్ చేయించార‌ట‌. గంట వెయిట్ చేసిన త‌రువాత డైరెక్ట‌ర్ విశాల్ భ‌ర‌ద్వాజ్ రావ‌డంతో త‌న ముందే నానా ప‌టేక‌ర్ ఈవెంట్ నుంచి వెళ్లి పోయి షాక్ ఇచ్చాడు.

అయితే నానా వెళ్లిపోవ‌డాన్ని లైట్ తీసుకున్న ద‌ర్శ‌కుడు విశాల్ భ‌ర‌ద్వాజ్ ..నానా ప‌టేక‌ర్‌ని చిన్న పిల్లాడిగా కామెంట్ చేయ‌డం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. నానా ప‌టేక‌ర్ నాకు గ‌త పాతికేళ్లుగా తెలుస‌ని, త‌న‌ది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వ‌మ‌ని, క్లాస్ రూంలో పిల్ల‌లు మారాం చేసిన‌ట్టుగా త‌న తీరు ఉంటుంద‌ని, దాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇద్ద‌రం క‌లిసి తొలిసారి ఈ సినిమా కోసం ప‌ని చేశామ‌ని చెప్పుకొచ్చాడు. దీంతో అక్క‌డున్న మీడియా అవాక్క‌యింద‌ట‌.