మరో 'కబీర్ సింగ్' అవుతాడనుకుంటే తేలిపోయాడు!
ఇది షాహిద్ కపూర్ గత చిత్రాలు దేవా, తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా కంటే మెరుగైన ఓపెనింగ్ అయినా కానీ, `కబీర్ సింగ్` స్థాయి వసూళ్లను మాత్రం అందుకోలేకపోయింది.
By: Sivaji Kontham | 14 Feb 2026 12:21 PM ISTషాహిద్ కపూర్ - ట్రిప్తి దిమ్రి జంటగా నటించిన `ఓ రోమియో` సినిమా నిన్న (ఫిబ్రవరి 13న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చూసిన తర్వాత ఇది కూడా మరో కబీర్ సింగ్ అవుతుందా? అని కొందరు అంచనా వేసారు. కానీ దీనికి అంత సీన్ లేదని మొదటి సమీక్షల్లోనే తిలిపోయింది. ఈ చిత్రంపై సోషల్ మీడియాలు ఎక్స్ వేదికగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
నెటిజనుల సమీక్షల ప్రకారం.. ఈ సినిమాకు అతిపెద్ద బలం షాహిద్ కపూర్ నటన. అతడు హుస్సేన్ ఉస్తారా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారని, ముఖ్యంగా యాక్షన్ , ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన టాప్ నాచ్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తృప్తి దిమ్రి కూడా తన పాత్రకు న్యాయం చేసిందని, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ సినిమాకు కథ, కథనం ప్రధాన బలహీనత. బలహీనమైన కథ కారణంగా తేలిపోయింది. విశాల్ భరద్వాజ్ మార్క్ స్లో బర్న్ టేకింగ్ మొదటి భాగంలో ఆకట్టుకున్నా కానీ.. రెండో భాగం చాలా సాగతీతగా ఉందని, క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విశాల్ భరద్వాజ్ నుండి కమినే, హైదర్ లాంటి క్లాసిక్ ఆశించిన ప్రేక్షకులకు ఈ సినిమా కొంత నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఇది ఒక రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలా ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు.
బాక్సాఫీస్ వసూళ్లు:
ఈ సినిమా మొదటి రోజు దాదాపు రూ. 8.25 - 8.33 కోట్ల వసూళ్లను సాధించింది. ఇది షాహిద్ కపూర్ గత చిత్రాలు దేవా, తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా కంటే మెరుగైన ఓపెనింగ్ అయినా కానీ, `కబీర్ సింగ్` స్థాయి వసూళ్లను మాత్రం అందుకోలేకపోయింది. మరోసారి కమర్షియల్ సినిమా మాస్టర్ మైండ్ సందీప్ వంగా ముందు ఇతరులు తేలిపోతారని కూడా ఇది ప్రూవ్ చేసింది.
డెబ్యూ నటితో పోటీనా?
మరోవైపు డెబ్యూ నటి షనాయా కపూర్ అరంగేట్రం చేసిన `తు యా మే` కూడా అదే రోజు విడుదలైంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉన్నా సీనియర్ నటుడిగా షాహిద్ హవా కొనసాగలేదు. అయితే తు యా మేలో షనాయా నటనకు మంచి మార్కులే పడుతున్నా కలెక్షన్స్ అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ఓ రోమియో మాస్ ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకర్షిస్తోంది. కానీ వసూళ్ల పరంగా బెటర్ మెంట్ కనిపించలేదు.
షాహిద్ కపూర్ నటన కోసం, విశాల్ భరద్వాజ్ స్టైల్ యాక్షన్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చని కొందరు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అద్భుతమైన కథను ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ చెందే అవకాశం ఉందని చెబుతున్నారు.
