ప్రమాదంలో హీరోయిన్ వెన్నుపూస బ్రేక్.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి!
సినిమా రంగంలో పనిచేయడం పైకి ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో తెరవెనుక నటీనటులు ఎదుర్కొనే సమస్యలు.. ప్రమాదాలు.. శారీరక నొప్పులు అంతకు మించినవి.
By: Sivaji Kontham | 2 Oct 2026 6:32 PM ISTసినిమా రంగంలో పనిచేయడం పైకి ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో తెరవెనుక నటీనటులు ఎదుర్కొనే సమస్యలు.. ప్రమాదాలు.. శారీరక నొప్పులు అంతకు మించినవి. షూటింగ్స్ సమయంలో లేదా ఇతర పనులపై వెళ్లినప్పుడు చాలా మంది నటీమణులు ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా బాలీవుడ్ నటి నుస్రత్ భారుచా ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. బాలికి వెళ్లిన ఈ నటి వెన్నుపూస విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ కోవలోనే టాలీవుడ్ టాలెంటెడ్ నటి నభా నటేష్ కూడా గతంలో ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తను కోలుకోవడానికి .. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా కాలమే పట్టింది. ఈ తీవ్రమైన గాయం కారణంగా ఆమె కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలా షూటింగ్ లొకేషన్లలో లేదా వ్యక్తిగత పనులపై వెళ్లినప్పుడు గాయపడిన నటీమణుల జాబితా పెద్దదే ఉంది.
కేవలం బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీమణులు కూడా కెరీర్లో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేటప్పుడు, లేదా డ్యాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రష్మిక మందన్న, సమంత, పూజా హెగ్డే వంటి ప్రముఖ కథానాయికలు కూడా పలు సందర్భాల్లో గాయాలపాలై.. ఆ తర్వాత కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొన్నవారే.
ఇలా షూటింగ్ లొకేషన్లలో రిస్క్ చేస్తూ పనిచేసే క్రమంలో నటీనటులు ఎముకలు విరగడం, కండరాల గాయాలు కావడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. దర్శకులు కోరుకున్న పర్ఫెక్షన్ కోసం.. ప్రేక్షకుల ముందుకు ఉత్తమమైన సినిమాను తీసుకురావడానికి వారు పడే శ్రమ వెనుక ఇలాంటి ఎన్నో ప్రమాదాలు- కష్టాలు దాగి ఉంటాయి. శారీరకంగా ఎంత వేదన అనుభవించినా చాలా మంది నటీమణులు కోలుకున్నాక మళ్లీ ఉత్సాహంగా కెమెరా ముందుకు రావడం వారి అంకితభావాన్ని తెలియజేస్తుంది.
ప్రస్తుతం బాలిలో గాయపడిన నుస్రత్ భారుచాను ముంబైకి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించి శస్త్రచికిత్స నిర్వహించడానికి తన టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. 2006లో `జై సంతోషి మా` చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి, `ప్యార్ కా పంచనామా`, `సోను కే టిటూ కి స్వీటి` వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినీ రంగంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రమించే ఇలాంటి నటీమణులందరి త్యాగం వెనుక వెండితెర వెలుతురు ఉంది.
