సంగీత దర్శకుడిని పెళ్లాడుతున్న కృతి సోదరి
అందాల కథానాయిక కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ గాయకుడు స్టెబిన్ బెన్ ని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
By: Sivaji Kontham | 4 Dec 2025 12:55 AM ISTఅందాల కథానాయిక కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ గాయకుడు స్టెబిన్ బెన్ ని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారతదేశంలోని అత్యంత సుందరమైన లగ్జరీ వెన్యూ ఫెయిర్‌మాంట్ ఉదయపూర్ ప్యాలెస్‌లో జనవరి 8 - 9 తేదీలలో ఈ వివాహం జరగనుంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పెళ్లిళ్లకు ఉదయ్ పూర్ వేదిక. ఇటీవలే నేత్ర మంతెన- వంశీ గాదిరాజుల వివాహం కూడా ఈ నగరంలోనే జరిగిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు నూపూర్ సనన్ పెళ్లికి ఈ ఫేమస్ డెస్టినేషన్ ని కుటుంబీకులు ఎంపిక చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు, ఎంపిక చేసిన పరిశ్రమ అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. ఇంకా ఇరువర్గాల నుంచి పెళ్లిపై అధికారిక వివరాలేవీ బయటకు రాలేదు. అయితే డెకరేషన్ బృందాలు, హాస్పిటాలిటీ సిబ్బంది ఆన్ సైట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ పెళ్లి గురించి ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
సరస్సు ఒడ్డున ఉన్న ప్యాలెస్‌లు, విశాలమైన ప్రాంగణాలు, రాజవంశపు గాంభీర్యంతో ఉదయ్ పూర్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజస్థానీ వైభవంతో నిండిన విలాసవంతమైన వేడుకలకు ఇది ప్రసిద్ధి.
అసలు నూపూర్ పెళ్లాడుతున్న వరుడు ఎవరు? అంటే.. స్టెబిన్ బెన్ ఇండీ-పాప్, ప్లేబ్యాక్ రంగంలో పాపులర్ పర్సనాలిటీ. మేరా మెహబూబ్, థోడా థోడా ప్యార్, బారిష్ వంటి విజయవంతమైన ఆల్బమ్స్ కి సంగీతం అందించాడు. ప్రస్తుతం పెద్ద తెరపై నటిగా నిరూపించుకోవాలని నూపూర్ తహతహలాడుతోంది. ఈ భామ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి అంతగా ప్రచారం కోరుకోదు. వారి సంబంధం గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నా ఈ జంట అరుదుగా మాత్రమే ఈ విషయాలను మాట్లాడేవారు.
జనవరి 8న మెహందీ , సంగీత్ మొదలు పెళ్లి వరకూ సందడి పరాకాష్టలో ఉండనుంది. అయితే ఈ జంట అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.
