Begin typing your search above and press return to search.

కలెక్షన్ల వేటలో కనుమరుగవుతున్న సినిమా కళ!

ప్రస్తుత చలనచిత్ర పరిశ్రమలో సినిమా విజయానికి కొలమానాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా కథ, కథనం, నటీనటుల ప్రదర్శన గురించి చర్చలు జరిగేవి.

By:  Srikanth Kontham   |   27 May 2026 3:00 PM IST
కలెక్షన్ల వేటలో కనుమరుగవుతున్న సినిమా కళ!
X

ప్రస్తుత చలనచిత్ర పరిశ్రమలో సినిమా విజయానికి కొలమానాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా కథ, కథనం, నటీనటుల ప్రదర్శన గురించి చర్చలు జరిగేవి. కానీ నేడు పరిశ్రమతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా కలెక్షన్లు, రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు కుముద్ మిశ్రా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సినిమా కళ కంటే బాక్స్ ఆఫీస్ నంబర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుముద్ మిశ్రా అభిప్రాయం ప్రకారం.. డిజిటల్ యుగం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ట్రేడ్ అనలిస్ట్‌లుగా మారిపోతున్నారు. సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అది ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనే లెక్కల చుట్టూనే చర్చలన్నీ తిరుగుతున్నాయి.

సినిమాలోని భావోద్వేగాలు, దర్శకుడి విజన్ , నటీనటులు పడిన శ్రమ వంటి అంశాలు ఈ నంబర్ల హోరులో కొట్టుకుపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ధోరణి సినిమా అసలైన ఆత్మను దెబ్బతీస్తోందని హెచ్చరించారు. బాక్స్ ఆఫీస్ సంస్కృతి వల్ల సామాన్య ప్రేక్షకుల ఆలోచనా విధానంలో కూడా తీవ్ర మార్పు వ‌స్తోంది. సినిమా బాగుందా లేదా అనేది చూసి స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రేక్షకులు కోల్పోతున్నార‌న్నారు. 100 కోట్లు ? 500 కోట్లు? వసూలు చేసిన చిత్రాలనే గొప్ప సినిమాలుగా భావించే ప్రమా దకరమైన ధోరణి పెరుగుతోందన్నారు.

ఈ నేప‌థ్యంలో అద్భుతమైన కథాంశాలతో, తక్కువ బడ్జెట్‌తో వచ్చే ఎన్నో మంచి సినిమాలు సరైన ఆదరణకు నోచుకోకుండానే థియేటర్ల నుండి నిష్క్రమిస్తున్నాయన్నారు. ఈ నంబర్ల ఒత్తిడి చిత్ర నిర్మాతలు , దర్శకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. కళాత్మక విలువలతో కూడిన సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద సేఫ్ జోన్‌లో ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది కమర్షియల్ ఫార్ములాలకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కథల్లో వైవిధ్యం లోపించి ఒకే రకమైన కథాంశాలు పునరావృతమ వుతున్నాయి. ఇది లాంగ్ రన్‌లో సినిమా రంగానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదని విశ్లేషించారు.

కుముద్ మిశ్రా లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు నటనకు, వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. సినిమా సాధించే వసూళ్లు తాత్కాలికమని, కానీ ఆ సినిమా ప్రేక్షకుడి మనసులో నిలిపే జ్ఞాపకం ప్రభావం శాశ్వతమని నమ్ముతారు. సినిమా అనేది వ్యాపార వస్తువు మాత్రమే కాదు. అది శక్తివంతమైన కళా రూపం. కాబట్టి వ్యాపారాన్ని, కళను వేర్వేరుగా చూడాల్సిన బాధ్యత ఇండస్ట్రీపై ఎంతైనా ఉంది. సినిమా మనుగడకు వ్యాపారం ఎంత అవసరమో? దానికి ప్రాణం పోయడానికి కళాత్మకత కూడా అంతే ముఖ్యం. బాక్స్ ఆఫీస్ నంబర్లను పక్కనపెట్టి కంటెంట్‌ను మాత్రమే చూసి ఆదరించే రోజులు మళ్లీ రావాలి. అప్పుడే సినిమా రంగంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి యువ దర్శకులకు, నటులకు ధైర్యం వస్తుంది. పరిశ్రమ కూడా లాభాల వేటలోనే కాకుండా సమాజానికి మంచి సినిమాలను అందించే దిశగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం అంతే ఉంది.