Begin typing your search above and press return to search.

బాలయ్యతో నన్ను తిట్టిస్తారా... నిర్మాతతో సీనియర్ ఎన్టీఆర్

తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహరాజుగా మూడున్నర దశాబ్దాలకు పైగా ఏలిన విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్. ఆయన నటనా వైదుష్యం వర్ణించడానికి మాటలు ఉండవు.

By:  Satya P   |   25 Aug 2026 9:31 AM IST
బాలయ్యతో నన్ను తిట్టిస్తారా... నిర్మాతతో సీనియర్ ఎన్టీఆర్
X

తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహరాజుగా మూడున్నర దశాబ్దాలకు పైగా ఏలిన విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్. ఆయన నటనా వైదుష్యం వర్ణించడానికి మాటలు ఉండవు. జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం, సాంఘికం ఇలా అన్ని జానర్లలో మూడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించిన హీరో ఎన్టీఆర్. ఆయనతో సినిమాలు తీయాలని ఎంతో మంది ఎదురుచూసే రోజులు అవి. ఇక సినీ రంగంలో అర్ధ శతాబ్దం పాటు నిర్మాతగా తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకున్న వారు అట్లూరి పూర్ణచంద్రరావు. ఆయన ఎన్టీఆర్ తో జాయింట్ ప్రాజెక్ట్ గా యమగోల చిత్రాన్ని 1977లో తీసి హిట్ కొట్టారు.

హిట్ చిత్రాల నిర్మాతగా :

అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగు హిందీ చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా విజయవంతమైన నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1960 ల నుంచి సినిమా రంగంలోకి వచ్చి వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ చిత్రాలు నిర్మించి ఆ రోజులలోనే పాన్-ఇండియా స్థాయి నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. సినిమాల నిర్మాణంతో పాటు ఆయన మంచి కమ్యూనిస్ట్ నాయకునిగా ఉంటూ సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా కూడా సేవలందించారు. హీరో మురళీ మోహన్ మొదటి సినిమా జగమే మాయ నిర్మాత కూడా ఆయనే. ఇదిలా ఉంటే ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ తో జ్ఞాపకాలు :

అట్లూరి పూర్ణచంద్రరావు మరో నిర్మాత కలసి యమగోల సినిమాను నిర్మించారు. ఈ సినిమా కధను డీవీ నరసరాజు రాశారు. ఈ కధను ఎన్టీఆర్ కి వినిపించాలని ఈ ఇద్దరూ కలసి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు. అక్కడ సినిమా కధను మాటలతో సహా డీవీ నరసరాజు వినిపించారు. ఎన్టీఆర్ ఈ కధను విని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇంతకీ ఈ సినిమాలో యముడు ఎవరు అని ఎన్టీఆర్ డీవీ నరసరాజుని ప్రశ్నించారు. దానికి ఆయన అట్లూరి పూర్ణచంద్రరావు వైపు చూస్తూ మీరే అన్నది నిర్మాత అభిప్రాయం అని చెప్పేశారు. సరే హీరో ఎవరు అనుకుంటున్నారు అని ఎన్టీఆర్ మళ్ళీ ప్రశ్నించారు. దానికి అట్లూరి పూర్ణచంద్రరావు బాలయ్య బాబుని అనుకుంటున్నామని తడుముకోకుండా చెప్పేశారు. అంతే ఎన్టీఆర్ కి ఆగ్రహం వచ్చింది.

జనాలు ఒప్పుకుంటారా :

ఈ సినిమాలో యముడుని విమర్శిస్తూ డీవీ నరసరాజు గారు భారీ డైలాగులు రాశారు. ఆ డైలాగులు తిట్లూ హీరో పాత్రధారిగా బాలయ్య బాబు నన్ను చూసి అంటూంటే జనాలు ఆమోదిస్తారా అంటూ ఎన్టీఆర్ ఒకింత కోప్పడ్డారు. అదేమీ లేదు, నేను హీరోగా వేస్తాను అని ఎన్టీఆర్ చెప్పేశారు. ఇక యముడు పాత్ర గురించే ఆలోచించుకోండని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత శివాజీ గణేషన్ పేరు చెప్పినా ఎన్టీఆర్ ఒప్పుకోలేదు, ఆయన గొప్ప నటుడు అని ఆ పాత్ర వేయరని ఎన్టీఆర్ చెప్పేశారు. చివరికి అంతా కలిసి కూర్చుని ఆలోచించి సత్యనారాయణ పేరుని ఫిక్స్ చేశారు. అలా తయారు అయిన ఎన్టీఆర్ యమగోల చిత్రం 1977 దసరా కానుకగా విడుదల అయి ఆంధ్ర దేశమంతా ఊపేసింది. బంపర్ హిట్ కొట్టింది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ సూపర్ హిట్ మూవీలో హీరో పాత్ర బాలయ్య బాబు వేయకుండా ఎన్టీఆర్ వేయడంతో మంచి హిట్ బాలయ్యకు పోయినట్లు అయింది అని చెప్పుకుంటారు.