ఏఎన్ఆర్-కృష్ణ మధ్య దేవదాసు యుద్దం!
అలాంటి సంస్థ ఏఎన్నార్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా కృష్ణ నటించిన `దేవదాసు` పంపిణీ హక్కులను తీసుకోవడం అక్కినేనిని తీవ్రంగా కలచివేసింది.
By: Srikanth Kontham | 18 March 2026 12:00 AM ISTతెలుగు సినీ చరిత్రలో దిగ్గజ నటులు ఎన్టీఆర్-కృష్ణ మధ్య విబేధాలున్న మాట వాస్తవం. కొన్ని కారణాలుగా ఇద్దరి మధ్య అప్పట్లో మనస్పర్దలొచ్చాయి. మరి అలాంటి మనస్పర్దలు అక్కినేని నాగేశ్వరరావు - సూపర్ స్టార్ కృష్ణ మధ్య కూడా ఉన్నాయా? అందుకు ఆజ్యం పోసింది `దేవదాసు` చిత్రమా అంటే అవుననే తెలుస్తోంది. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే.. వీరిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల గురించి సీనియర్ నటుడు నారాయణరావు ఓ ఇంట ర్వ్యూలో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది వృత్తిపరమైన పోటీయే కాకుండా? ఆత్మగౌరవ పోరాటంగా మారిన ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన వివరించారు.
వివరాల్లోకి వెళ్తే అక్కినేని నాగేశ్వరరావు గారు గుండె ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడ దాదాపు ఏడాది కాలం పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో టాలీవుడ్‌లో ఏఎన్నార్ ప్రాభవం తగ్గుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో కృష్ణ గారు ఏఎన్నార్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన `దేవదాసు` చిత్రాన్ని రంగుల్లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కినేని అమెరికాలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఈ గొడవకు అసలు కేంద్రబిందువు శ్రీ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ. ఏఎన్నార్ నటించిన సినిమాలను అత్యధికంగా పంపిణీ చేసే ఈ సంస్థ అక్కినేనికి అత్యంత సన్నిహితమైనది.
అలాంటి సంస్థ ఏఎన్నార్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా కృష్ణ నటించిన `దేవదాసు` పంపిణీ హక్కులను తీసుకోవడం అక్కినేనిని తీవ్రంగా కలచివేసింది. తన మనుషులే తన శత్రువులతో చేతులు కలిపారన్న భావన ఆయనలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అమెరికా నుంచి తిరిగి రాగానే ఏఎన్నార్ ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్నారు.
కృష్ణ `దేవదాసు` విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఏఎన్నార్ వ్యూహాత్మక అడుగు వేశారు. తన పాత బ్లాక్ అండ్ వైట్ `దేవదాసు` నెగటివ్ హక్కులను స్వయంగా కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. కృష్ణ కొత్త సినిమాకు పోటీగా తన పాత క్లాసిక్‌ను నిలబెట్టి తన సత్తా ఏంటో నిరూపించాలనుకున్నారు.
ఈ పోటీ ఫలితం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. కృష్ణ నటించిన కలర్ `దేవదాసు` భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకులు ఏఎన్నార్ పాత దేవదాసుకే పట్టం కట్టారు. పాత సినిమాను మళ్ళీ రెండోసారి చూసేందుకు జనం థియేటర్లకు పోటెత్తారు. ఫలితంగా కృష్ణ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందింది. ఏఎన్నార్ పాత చిత్రం రీ-రిలీజ్‌లోనూ ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం మరే స్టార్ల మధ్య కనిపించలేదు. రిలీజ్ ల్లో పోటీ ఉండేది గానీ రహస్యమైన పోటీ అయితే లేదనే చెప్పాలి.
