గాడ్ ఆఫ్ వార్.. క్లారిటీ వచ్చేది ఆ రోజునే!
టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌లలో గాడ్ ఆఫ్ వార్ ఒకటి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ భారీ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 6 May 2026 11:38 AM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌లలో గాడ్ ఆఫ్ వార్ ఒకటి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ భారీ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా హీరో విషయంలో జరిగిన మార్పులు, ఊహాగానాలు ఈ ప్రాజెక్ట్‌ను మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. ప్రారంభంలో ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప2 తర్వాత బన్నీ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరగడంతో, ఆయన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో మార్పులు చోటు చేసుకున్నాయి.
పుష్ప2 తర్వాత బన్నీ, అట్లీతో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయడంతో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లింది. ఎన్టీఆర్ కెరీర్లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో భారీ మైథలాజికల్ సినిమా రానుందని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఇంకా బన్నీ చేతిలోనే ఉందని అతని కాంపౌండ్ వర్గాలు చెప్పడంతో పాటూ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు పై అనిశ్చితి నెలకొంది. సరే ఈ ప్రాజెక్టు బన్నీ చేస్తున్నాడా అంటే రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా అతను చేస్తున్న, చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ రాగా, ఆ అప్డేట్స్ లో లోకేష్ కనగరాజ్ మూవీ ఉంది కానీ గాడ్ ఆఫ్ వార్ సినిమా అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఎన్టీఆర్ చేతిలోనే ఉందనే వార్తలు మళ్లీ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ వద్దే ఉందని బలంగా టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్‌లో తన క్రేజ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, భారీ స్థాయి కథలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ వంటి ప్రాజెక్ట్ ఆయనకు సరైన ఛాయిస్‌గా భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఎన్టీఆర్ చేయడం దాదాపు ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మే 20 కీలక తేదీగా మారింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో, ఆ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం ఈ వీడియో కోసం వీఎఫ్ఎక్స్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని, అత్యున్నత నాణ్యతతో వీడియోను రూపొందించేందుకు టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగి, విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలకు తగ్గట్టుగా వస్తే మే 20న ఈ సినిమాను అనౌన్స్ చేయాలని టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనౌన్స్‌మెంట్ వీడియోనే హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ స్కేల్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక సినిమా ప్రకటనే కాకుండా, టాలీవుడ్‌లో కొత్త ప్రమాణాలను సెట్ చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఒకవేళ మే 20న అనౌన్స్‌మెంట్ వస్తే, గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌గా అధికారికంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, హీరో మార్పుల చర్చలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ అంచనాల మధ్య కీలక దశలోకి చేరింది. మే 20న వచ్చే అప్డేట్‌తో అన్ని సందేహాలకు తెరపడుతుందా? లేక ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
