Begin typing your search above and press return to search.

తారక్, త్రివిక్రమ్ మూవీ.. ఎందుకంత తొందర?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో జోష్ నెలకొంది.

By:  M Prashanth   |   30 Jun 2026 10:27 AM IST
తారక్, త్రివిక్రమ్ మూవీ.. ఎందుకంత తొందర?
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో జోష్ నెలకొంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత వారిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఒక్క పోస్టర్ విడుదల కావడంతో కథ, పాత్రలు, బ్యాక్ డ్రాప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో అసలు సినిమా ఇంకా ప్రారంభం కాకముందే ఎందుకింత తొందర అనే ప్రశ్న వినిపిస్తోంది.





అనౌన్స్మెంట్ పోస్టర్‌ లో త్రిశూలం, నంది కొమ్ములు, కార్తికేయుడిని గుర్తు చేసే ఆయుధం, ఆలయాలు, యుద్ధ వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా విజువల్స్ కనిపించాయి. సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రంలోని శ్లోకాన్ని పోస్టర్‌ లో పొందుపరిచారు. దీంతో కార్తికేయ స్వామి ఆధారంగా సాగే కథ అని అంతా ఫిక్స్ అయ్యారు. మరికొందరు ఇది కంప్లీట్ మైథలాజికల్ సినిమా అని అభిప్రాయపడ్డారు. అయితే పోస్టర్‌ ను మరో యాంగిల్ లో పరిశీలించిన సినీ ప్రియులు, ఇందులో కనిపిస్తున్న కొన్ని డిజైన్ ఎలిమెంట్స్‌ బట్టి కథ పురాణాలకే పరిమితం కాకపోవచ్చని భావిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ త్రివిక్రమ్ కథలో యాడ్ చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గతంలో ఎన్టీఆర్ చేతిలో కనిపించిన 'మురుగ: ద లార్డ్ ఆఫ్ వార్, ద గార్డ్ ఆఫ్ విస్డం' పుస్తకాన్ని ఇప్పుడు సినిమాతో లింక్ చేస్తూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చర్చలను మరింత పెంచింది నిర్మాత నాగవంశీ పోస్ట్. "ఉత్తరాన పుట్టాడు.. " అంటూ ఆయన చేసిన పోస్ట్ కార్తికేయుడినే ఉద్దేశించి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నాగవంశీ కామెంట్స్ లో మురుగన్ పుట్టిన ప్లేస్ ప్రస్తావన ఉండటంతో, తమిళనాడుకు చెందిన కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మురుగన్‌ కు సంబంధించిన విశ్వాసాలు, సంప్రదాయాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ చర్చను మరో విధంగా తీసుకెళ్లారు. అయితే కథ గురించి ఎలాంటి అధికారిక వివరాలు రాకముందే ఇలాంటి నిర్ణయాలకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అభిమానుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు విడుదలైంది కేవలం అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రమేనని, కథ, పాత్రలు ఎలా ఉంటాయో మూవీ టీమ్ ఇంకా వెల్లడించలేదని గుర్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియకుండా సినిమాపై అంచనాలు వేయడం లేదా వివాదాలు సృష్టించడం తొందరపాటు అని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమా సెట్స్‌ పైకి రావడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఏదేమైనా ఒక్క పోస్టర్ ఆధారంగా కథను పూర్తిగా అంచనా వేయడం, అనవసరమైన చర్చలు జరపడం కంటే మూవీ టీమ్ చెప్పే అధికారిక వివరాల కోసం వేచి చూడటం మంచిదని సినీ ప్రియులు భావిస్తున్నారు. సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది. అసలు కథ ఏంటి? త్రివిక్రమ్ ఎలాంటి వరల్డ్ ను క్రియేట్ చేయబోతున్నారు? ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.