'డ్రాగన్' తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ యుద్ధం మొదలు
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో ఒకటైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కాల్సిన `గాడ్ ఆఫ్ వార్` నిరంతరం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 1 Oct 2026 9:41 AM ISTటాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో ఒకటైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కాల్సిన `గాడ్ ఆఫ్ వార్` నిరంతరం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టుపై తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. `డ్రాగన్` సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన `అరవింద సమేత వీరరాఘవ` బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఇప్పుడు అదే జోడీ మరింత భారీ స్థాయిలో వస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల.. ఎన్టీఆర్ ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆలస్యమైంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు త్రివిక్రమ్ వెంకటేష్‌తో కలిసి `ఆదర్శ కుటుంబం` చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రస్తుతం ఆ పనులన్నీ ముగింపు దశకు రావడంతో... త్రివిక్రమ్ పూర్తి దృష్టిని ఎన్టీఆర్ సినిమాపైనే కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ సినిమాను పకడ్బందీగా పట్టాలెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వంద శాతం పూర్తయింది. కథా చర్చలు పూర్తి కావడంతో పాటు ఫైనల్ వెర్షన్ లాక్ అయినట్లు సమాచారం. కేవలం సినిమా టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేయడం మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. టైటిల్ లాక్ అయిన వెంటనే షూటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేసి.. రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ హింట్ ఇచ్చారు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు, త్రివిక్రమ్ రాసే పదునైన సంభాషణలు, భావోద్వేగాలతో కూడిన కథాంశం తోడైతే టాలీవుడ్‌లో మరో క్లాసిక్ సినిమాను చూడవచ్చునని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, బలమైన నేపథ్యంతో సాగే ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న `డ్రాగన్` చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ముగిసిన వెంటనే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. ఈసారి ఎలాంటి డిలే లేకుండా సినిమాను వేగంగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. తారక్, త్రివిక్రమ్ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఏ విధమైన సంచలనాలు సృష్టిస్తారో చూడాలని నందమూరి అభిమానులు.. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
