సింగ్ గీతంపై తారక్ రివ్యూ.. మనసును హత్తుకుందంటూ..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మంచి సినిమాల పట్ల తన అభిమానం చాటుకున్నారు.
By: M Prashanth | 16 Jun 2026 12:02 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మంచి సినిమాల పట్ల తన అభిమానం చాటుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సింగ్ గీతం చిత్రాన్ని చూశాక తారక్ సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సినిమా తన హృదయాన్ని హత్తుకుందని చెబుతూ.. మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
సింగ్ గీతం అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఎమోషన్స్ ను తాకే అందమైన ఎక్స్పీరియన్స్ అని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 94 ఏళ్ల వయసులోనూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చూపించిన క్రియేటివిటీ తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ వయసులో కూడా కొత్తగా ఆలోచిస్తూ ప్రేక్షకులకు ప్రత్యేకమైన కథలు అందించాలనే తపన నిజంగా ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు.
సింగీతం శ్రీనివాసరావు నాలుగు దశాబ్దాలుగా మనసులో పెట్టుకున్న కలను సాకారం చేయడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక పాత్ర పోషించారని తారక్ ప్రశంసించారు. ఒక లెజెండ్ కలను సిల్వర్ స్క్రీన్ పై చూపించడం దేవుడు ఇచ్చిన వరంతో సమానమని పేర్కొన్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఆ సినిమా ద్వారా సింగీతం గారికి అందించిన ట్రిబ్యూట్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
సినిమాకు మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ వర్క్ ను కూడా ఎన్టీఆర్ స్పెషల్ గా అభినందించారు. ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారని, మూవీలోని ఎమోషన్స్ ప్రేక్షకుల హృదయాలకు మరింత చేరువ చేసేలా ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిలిచిందని ప్రశంసించారు. అయితే తారక్ ను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది మూవీ టీమ్ ప్లాన్ చేసిన వినూత్న ప్రమోషన్స్. సాధారణంగా సినిమా విడుదలకు ముందే ట్రైలర్ విడుదల చేయడం ఆనవాయితీ.
కానీ సింగ్ గీతం విషయంలో సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ట్రైలర్ ను విడుదల చేయడం ఒక అరుదైన ప్రయోగంగా ఆయన అభివర్ణించారు. సింగీతం గారి సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంటాయని, ఈ నిర్ణయం కూడా అదే క్రియేటివిటీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇప్పుడు స్పెషల్ ట్రైలర్ ను ప్రేక్షకులకు అందించే అవకాశం తనకు రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తారక్ తెలిపారు. సినీ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలు చేయడంలో సింగీతం గారికి ఆయనే సాటి అని సింగ్ గీతం మరోసారి నిరూపించిందని కొనియాడారు.
మంచి సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్, ఈసారి కూడా సింగ్ గీతం మూవీని థియేటర్లలో తప్పక చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తొలి షో నుంచి మంచి టాక్ తెచ్చుకున్న సింగ్ గీతం సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రశంసలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. క్రియేటివిటీకి ఎప్పుడూ వయసు అడ్డుకాదని, మంచి కథలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయని మరోసారి ఆ చిత్రం ప్రూవ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
