Begin typing your search above and press return to search.

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

సీనియర్ నటుడు మురళీమోహన్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, ప్రేమతోనే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. దాదాపు 350 సినిమాల్లో నటించిన ఆయన, 2014లో టీడీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు డబ్బు, పేరు కోసం కాకుండా ప్రజాసేవ కోసం రావాలని సూచించారు. ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని, అలా చేస్తే ప్రజలే నష్టపోతారని హెచ్చరించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Nov 2026 9:21 AM IST
సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!
X

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, మరో హీరోకు వీరాభిమానిగా ఉండటం కొంతమందికే సాధ్యమవుతుంది. తమ అభిమాన నటుడి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారు. అయితే ఒక నటుడిగా ఉంటూ మరో నటుడిపై అమితమైన అభిమానం చూపించడం ప్రత్యేకమైన విషయం. సీనియర్ నటుడు మురళీమోహన్ జీవితంలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానమే ఆయనను రాజకీయాల వైపు నడిపించింది.

తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 350 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీమోహన్. హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. నటనతో పాటు నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా పేరు సంపాదించారు. జయభేరి గ్రూప్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

అయితే మురళీమోహన్‌కు మొదటి నుంచి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదట. కానీ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ, అభిమానం కారణంగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.

"నాకు మొదటి నుంచి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, భక్తి, ప్రేమతోనే రాజకీయాల్లోకి వచ్చాను. తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవం తీసుకురావాలనే పట్టుదల ఎన్టీఆర్‌లో ఉండేది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను కూడా మద్దతుగా నిలిచాను" అని చెప్పారు.

2014లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు.

"డబ్బులు కావాలని రాజకీయాల్లోకి వస్తున్నారా? లేదా పేరు కోసం రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే విషయాన్ని ముందుగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే రాజకీయాల్లోకి రావాలి" అని సూచించారు.

అంతేకాదు, ఓటు హక్కును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "ఓటుకు ఇంత డబ్బు తీసుకొని ముసుగేసుకుని పడుకుంటే, జీవితాంతం మనం బిచ్చగాళ్లుగానే మిగిలిపోతాం. వాళ్లు మాత్రం మేడలు, మిద్దెలు కట్టుకొని ఎదిగిపోతారు" అని మురళీమోహన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.