యువనిర్మాతకు విలువైన ఆ మూడు కానుకలు
ఎవరైనా తనను అభిమానిస్తే వారి కోసం ఎంతదాకా అయినా వెళతారు మన స్టార్లు. తిరిగి వారిని అభిమానిస్తారు.
By: Sivaji Kontham | 4 Jan 2026 12:54 PM ISTఎవరైనా తనను అభిమానిస్తే వారి కోసం ఎంతదాకా అయినా వెళతారు మన స్టార్లు. తిరిగి వారిని అభిమానిస్తారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు అభిమానిగా ఉంటూ, ఎప్పుడూ ప్రేమ ఆప్యాయతల్లో లోటు రానివ్వరు. వీలున్న ప్రతి వేదికపైనా వారి బాగోగుల గురించి మాట్లాడగారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, ఎదగాలని ఆకాంక్షిస్తారు.
అయితే తనతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్లు అందించిన యువనిర్మాత కూడా ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆ అభిమానం ఏమో కానీ, ఆ సినిమాలు రిలీజైనప్పుడు ఖరీదైన వాచ్ లను ఎన్టీఆర్ నుంచి కానుకగా అందుకున్నాడు. ఈ విషయాన్ని సదరు నిర్మాత స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరు ఆ యువ నిర్మాత? అంటే... పేరు నాగవంశీ. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ అధినేత. మాతృక సంస్థ `హారిక అండ్ హాసిని క్రియేషన్స్`లో అగ్ర హీరోలతో నాగవంశీ పలు బ్లాక్ బస్టర్లను నిర్మించిన సంగతి తెలిసిందే.
తన హీరోలకు గిఫ్టులు ఇవ్వడంలోనే కాదు, వారి నుంచి రిటర్న్ గిఫ్టులు కూడా పొందారు నాగవంశీ. తన సినిమాల హీరోల నుంచి రిటర్ను గిఫ్టులు మూడు సార్లు అందుకున్నానని వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రెండు సార్లు తారక్ అన్న ఖరీదైన వాచ్ లను కానుకగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అరవింద సమేత, దేవర లాంటి బ్లాక్ బస్టర్ల సమయంలో తనకు ఖరీదైన వాచ్ లను కానుకగా ఇచ్చారని నాగవంశీ తెలిపారు. అల్లు అర్జున్ (బన్ని) అల వైకుంఠపురములో విడుదలయ్యాక ఖరీదైన వాచ్ ని కానుకగా ఇచ్చారు. అయితే వీటిని రెగ్యులర్ గా ధరిస్తారా? అని ప్రశ్నిస్తే, అవన్నీ షో కేస్ లో దాచుకున్నానని చెప్పారు.
`అరవింద సమేత` సమయంలో ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న వాచ్ ని కానుకగా ఇచ్చేమని అడిగానని నాగవంశీ తెలిపాడు. ``వాడింది ఎందుకు రా కొత్తది కొనిస్తాను అని ఎన్టీఆర్ అన్న అన్నారు.. కానీ నాకు ఇదే కావాలని పట్టుబట్టాను`` అని కూడా వెల్లడించారు. అలా ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ గడియారాన్ని తన సొంతం చేసుకున్నారు. అయితే తారక్ పై తనకు ఉన్న అభిమానం అలాంటిది. `ఆది` సినిమా సమయం నుంచి ఎన్టీఆర్ పై అభిమానం ఏర్పడిందని నాగవంశీ వెల్లడించారు. అలాగే ఖరీదు చూసి కానుకలు ఇచ్చే స్వభావం ఎన్టీఆర్ కు లేదని కూడా నాగవంశీ తెలిపారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ కమర్షియల్ హిట్‌లతో పాటు వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2026 లో వరుసగా పలు భారీ చిత్రాలను ఈ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ పోలిశెట్టి, నాని, సిద్ధు జొన్నలగడ్డ, దేవరకొండ వంటి హీరోలతో సితార బ్యానర్ పలు చిత్రాలను నిర్మిస్తోంది. ఇతర బ్యానర్లతో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన `అనగనగా ఒక రాజు` ఈ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో జంటగా నటించారు. స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.
