Begin typing your search above and press return to search.

డ్రాగన్.. మైత్రీ క్లారిటీ ఇచ్చినా డౌట్స్ పోవట్లేదే!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌ను 2027 జూన్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే డేట్ వేసేశారు.

By:  M Prashanth   |   16 Sept 2026 9:45 AM IST
డ్రాగన్.. మైత్రీ క్లారిటీ ఇచ్చినా డౌట్స్ పోవట్లేదే!
X

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌ను 2027 జూన్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే డేట్ వేసేశారు. మధ్యలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో డేట్ మారుతుందనే టాక్ మొదలైంది. ఇరుముడి సక్సెస్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ మాత్రం రెండు వారాల్లో షూటింగ్ మళ్లీ మొదలవుతుందని, ఫిబ్రవరి నాటికి మొత్తం పూర్తి చేసి జూన్‌లోనే సినిమాను తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఆ మాట వచ్చి రెండు వారాలు కూడా కాకముందే ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. షూటింగ్ అనుకున్న స్పీడ్ లో జరగడం లేదని, జూన్ డేట్ అందుకోవడం కష్టమైతే 2027 దసరా వరకు వెళ్లొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మైత్రీ నుంచి కొత్తగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం అధికారికంగా ఉన్న డేట్ మాత్రం జూన్ 11నే.

డౌట్స్ రావడానికి కూడా కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ గాయం కారణంగా ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. శ్రీలంకలో ప్లాన్ చేసిన షెడ్యూల్ కూడా ఆగిపోయింది. అందులో పాటతో పాటు కొన్ని కీలక సీన్స్ తీయాల్సి ఉందనే సమాచారం వచ్చింది. పెద్ద యాక్షన్ సినిమా కావడంతో ఒక షెడ్యూల్ వెనక్కి వెళ్లినా తర్వాతి ప్లాన్ మొత్తం సర్దుకోవాల్సి వస్తుంది.

పైగా డ్రాగన్ షూటింగ్‌తో పని అయిపోదు. ప్రశాంత్ నీల్ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్, యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం పడుతుంది. మేకర్స్ చెప్పినట్లుగా ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయితే జూన్ రిలీజ్‌కు దాదాపు నాలుగు నెలల సమయం ఉంటుంది. పని ముందే జరుగుతుంటే ఆ గ్యాప్ సరిపోవచ్చు. కానీ షూటింగ్ మరో నెల రెండు నెలలు వెనక్కి వెళ్లితే మాత్రం జూన్ డేట్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

ఇక్కడ నిర్మాత మాటను కూడా పక్కన పెట్టలేం. షూటింగ్‌ను ఇక పెద్ద బ్రేక్స్ లేకుండా కొనసాగించి ఫిబ్రవరిలో పూర్తి చేస్తామని రవిశంకర్ స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా డ్రాగన్ ఆలస్యమవుతోందనే వార్తలు వచ్చినప్పుడు మైత్రీ టీమ్ డైరెక్ట్ గా స్పందించింది. అందుకే ఇప్పుడు వినిపిస్తున్న దసరా టాక్‌ను రిలీజ్ మారిపోయిందని తీసుకోవడానికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం డ్రాగన్‌కు అసలు టెస్ట్ వచ్చే నాలుగైదు నెలలే. ఎన్టీఆర్ షూటింగ్‌లో ఎంత రెగ్యులర్‌గా పాల్గొంటారు, ప్రశాంత్ నీల్ ఫిబ్రవరి టార్గెట్‌ను అందుకుంటారా అన్నదానిపై జూన్ డేట్ ఆధారపడి ఉంటుంది.