Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ ను కాపాడేందుకు డ్రాగ‌న్ మేకర్స్ తెలివైన అడుగు!

అందుకే ఒక పెద్ద సినిమా షూటింగ్‌లో అనుకోని గ్యాప్ వచ్చినా, దాని ప్రభావం మొత్తం ప్రాజెక్ట్‌పై పడకుండా చూడటం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Aug 2026 3:58 PM IST
రిలీజ్ డేట్ ను కాపాడేందుకు డ్రాగ‌న్ మేకర్స్ తెలివైన అడుగు!
X

పాన్ ఇండియా సినిమాల విషయంలో రిలీజ్ డేట్ అనేది కేవలం ఒక డేట్ మాత్రమే కాదు. థియేట్రికల్ ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్స్, ఓటీటీ డీల్స్, ప్రమోషన్ షెడ్యూల్స్, ఇతర భాషల రిలీజ్‌లు వంటి అనేక అంశాలు దానిపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక పెద్ద సినిమా షూటింగ్‌లో అనుకోని గ్యాప్ వచ్చినా, దాని ప్రభావం మొత్తం ప్రాజెక్ట్‌పై పడకుండా చూడటం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది.

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగ‌న్ విషయంలో కూడా ప్రస్తుతం ఇదే డిస్క‌ష‌న్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ భుజం గాయం కారణంగా కొద్ది వారాల విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తిగా ఆపేయకుండా ముందుకు తీసుకెళ్లే వ్యూహాన్ని మేక‌ర్స్ అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు రిలీజ్ డేట్‌ను కాపాడేందుకు మేకర్స్ వేసిన కీలక అడుగుగా కనిపిస్తోంది.

పెద్ద సినిమాల్లో హీరో అందుబాటులో లేని టైమ్ లో మొత్తం యూనిట్ వెయిట్ చేయ‌డం వ‌ల్ల భారీ ఆర్థిక భారం ఏర్పడుతుంది. సెట్స్ నిర్వహణ, టెక్నికల్ టీమ్, ఇతర నటీనటుల డేట్స్, లాజిస్టిక్స్ వంటి అంశాలు ఆలస్యంతో మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్స్‌ను రీషెడ్యూల్ చేసి, హీరో అవసరం లేని కాంబినేషన్ సీన్స్, ఇతర క్యారెక్ట‌ర్ల‌కు సంబంధించిన ఎపిసోడ్స్, ఇండిపెండెంట్ సీక్వెన్స్‌లను పూర్తి చేసే విధంగా షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇలాంటి షెడ్యూలింగ్ పద్ధతి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో చాలా కీలకంగా పరిగణిస్తారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రతి షూటింగ్ రోజూ విలువైనదే. ఒక షెడ్యూల్ పోస్ట్‌పోన్ అయితే దాని ఎఫెక్ట్ తర్వాతి షెడ్యూల్స్, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్స్, ప్రమోషన్ క్యాలెండర్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే డైరెక్ట‌ర్లు, ప్రొడక్షన్ టీమ్స్ ప్రత్యామ్నాయ షెడ్యూల్స్‌ను రెడీగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు.

డ్రాగ‌న్ టీమ్ ప్రస్తుతం అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మోమెంటమ్‌ను కంటిన్యూ చేస్తూ, హీరో తిరిగి సెట్స్‌లో చేరే టైమ్ కు మెయిన్ సీన్స్ పై ఫోకస్ పెట్టేలా ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌పై పెద్దగా ప్రభావం పడకుండా చూసే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో తరచుగా రూమర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్న ఈ స‌మ‌యంలో, ఒక భారీ సినిమా ప్రొడక్షన్‌ను ఎలా మేనేజ్ చేస్తారు? రిలీజ్ ప్లాన్‌ను ఎలా కాపాడుకుంటారు? అనే ప్రశ్నకు డ్రాగ‌న్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్టీఆర్ అందుబాటులో లేక‌పోయినా సినిమా షూటింగ్ ను ఆప‌క‌పోవ‌డంతో రిలీజ్ డేట్ వెన‌క్కి వెళ్ల‌ద‌ని తెలిసి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.