Begin typing your search above and press return to search.

గాలి ప్ర‌చారం గూబ గూయ్యిమ‌నేలా ప్లానింగ్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'డ్రాగ‌న్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   20 Nov 2025 11:53 AM IST
గాలి ప్ర‌చారం గూబ గూయ్యిమ‌నేలా ప్లానింగ్!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'డ్రాగ‌న్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. అయితే మ‌ధ్య‌లో సినిమా ఆగిపోయింద‌నే ప్ర‌చారం కూడా పెద్ద ఎత్తున జ‌రిగింది. ఔట్ పుట్ విష‌యంలో తార‌క్ సంతృప్తిగా లేడ‌ని..దీంతో షూటింగ్ అపేసార‌ని..ఆ కార‌ణంగానే మూడు నెల‌లుగా షూటింగ్ చేయ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో పాటు తార‌క్ అనూహ్యంగా స్లిమ్ లుక్ లోకి మారిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. `డ్రాగ‌న్` కోసం షూటింగ్ మ‌ధ్య‌లో ఎందుకు బ‌రువు త‌గ్గుతాడ‌ని..వెయిట్ లాస్ అవ్వ‌డం అన్న‌ది కొత్త సినిమా కోసమంటూ మ‌రో ప్ర‌చారం ఊపందుకుంది.

మూడు వారాలు విరామం లేకుండా:

అయితే వీటిపై తారక్-ప్ర‌శాంత్ నీల్ ఎక్క‌డా స్పందించ‌లేదు. మీ ప‌ని మీదే..మా ప‌ని మాదే అన్న తీరులో ఇరువురు క‌నిపించారు. దీంతో ఇదంతా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారం త‌ప్ప వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. తాజాగా కొత్త షెడ్యూల్ కు సంబంధించి అప్ డేట్ వ‌చ్చేసింది. సినిమాకు సంబంధించిన త‌దుప‌రి షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించ‌డానికి మేక‌ర్స్ సిద్ద‌మ‌వుతున్నారు. ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు ఎలాంటి విరామం లేకుండా రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతుంది. దీనికి సంబంధించి భారీ సెట్ లు నిర్మిస్తున్నారు.

జ‌న‌వ‌రిలో ఆఫ్రికా షెడ్యూల్:

ఇందులో తార‌క్ స‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. అటుపై క్రిస్మ‌స్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సెల‌వులు ప్ర‌క‌టిస్తారు. తిరిగి మ‌ళ్లీ ఆ షెడ్యూల్ కి కొన‌సాగింపు షూటింగ్ జ‌న‌వ‌రి 5 నుంచి పున ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. అలాగే ఇదే సినిమాకు సంబంధించి ఆఫ్రికాలో కూడా కొంత భాగం షూటింగ్ ప్లాన్ చేసారు. లోకేష‌న్లు కూడా ఫైన‌ల్ అయ్యాయి. కానీ చిత్రీక‌ర‌ణ మాత్రం జ‌ర‌గ‌లేదు. వాస్త‌వానికి ఆయా లొకేష‌న్స్ లో ఇప్ప‌టికే షూటింగ్ జ‌ర‌గాలి. కానీ అనుకున్న స‌మ‌యంలో షెడ్యూల్స్ పూర్తి కాక‌పోవ‌డంతో ఆఫ్రికా షూటింగ్ కి కూడా తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.

ఇక ఆల‌స్యం చేస్తే కుద‌ర‌దు:

రామోజీ ఫిలిం సిటీ షెడ్యూల్ అనంత‌రం జ‌న‌వ‌రిలోనే ఆప్రికా షెడ్యూల్ కూడా మొద‌ల‌వుతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. దాదాపు మూడు వారాల పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ లో రిలీజ్ అంటూ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈలోగా షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి సిద్దంగా ఉండాలి. అంటే చిత్రీక‌ర‌ణ వేగ‌వంతం చేయాలి. ప్ర‌శాంత్ నీల్ మునుప‌టి చిత్రాల్లా నెమ్మ‌దిగా షూటింగ్ చేస్తే జూన్ లో రిలీజ్ సాధ్య‌ప‌డ‌దు. అదే జ‌రిగితే? తార‌క్ త‌దుప‌రి చిత్రాలు మ‌రింత డిలే అవుతాయి. ఇప్ప‌టికే తార‌క్ కోసం స్టార్ డైరెక్ట‌ర్లు అంతా క్యూలో ఉన్న సంగ‌తి తెలిసిందే.