దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్.. అందుకే తారక్ స్కిప్!
రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాణంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు ఎన్టీఆర్ ని సంప్రదించారని కూడా కథనాలొచ్చాయి.
By: Sivaji Kontham | 7 Oct 2025 12:22 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్`(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2026 వేసవి రిలీజ్ లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, తదుపరి కొరటాల దర్శకత్వంలో దేవర 2, త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చిత్రాలను పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని కథనాలొస్తున్నాయి.
అయితే కొంతకాలంగా యంగ్ యమ ఓ బయోపిక్ చిత్రంలో నటించేందుకు అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాణంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు ఎన్టీఆర్ ని సంప్రదించారని కూడా కథనాలొచ్చాయి.
అయితే ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం లేదని తాజాగా తెలుగు మీడియాలో కథనాలొస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా తెలుగు చిత్రాలపైనే ఫోకస్ చేస్తున్నాడు. హృతిక్ - అయాన్ ముఖర్జీతో `వార్ 2` ఆశించిన ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో అతడి ఆలోచనలు పూర్తిగా మారాయి. అతడు ఒక పాన్ ఇండియా చిత్రంలో లేదా హిందీ ఆడియెన్ ని టార్గెట్ చేసే చిత్రంలో నటించాలని భావించడం లేదు. తన ప్రాధాన్యత అంతా తెలుగు భాషపైనే అని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ మళ్లీ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించాల్సి వస్తే, తిరిగి రాజమౌళితో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ప్రస్తుతానికి ఫాల్కే బయోపిక్ లో నటించకూడదని తారక్ భావిస్తున్నట్టు కూడా కథనాలొస్తున్నాయి. రాజమౌళి సమర్పణలో కాకుండా దర్శకత్వంలో మాత్రమే! తారక్ నటించే వీలుంది.
ఎన్టీఆర్ కి కాల్షీట్ల సమస్య:
ఎన్టీఆర్ వార్ 2 పరాజయం తర్వాత తన తదుపరి సినిమాలకు కాల్షీట్లను చకచకా లాక్ చేసారు. అతడు తదుపరి ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ ని పూర్తి చేసి వేగంగా కొరటాల శివ, త్రివిక్రమ్ లతో సినిమాలను పూర్తి చేయాలనుకోవడంతో ఈ రెండిటికి ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండకూడదని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.
అయితే తారక్ ఫాల్కే బయోపిక్ నుంచి వైదొలిగిన తరువాత ప్రభాస్‌ను ప్రత్యామ్నాయంగా పరిగణించిన కార్తికేయ బృందం అతడితో చర్చిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత షెడ్యూళ్ల ప్రకారం.. ప్రభాస్ కూడా భవిష్యత్తులో అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. ప్రభాస్ తదుపరి సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` షూటింగ్ ప్రారంభించి ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `కల్కి 2898 AD: పార్ట్ 2`ని పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ పాన్ ఇండియా కాన్సెప్టులతో రూపొందనున్నాయి. వాటి కోసం సుదీర్ఘ కాలం కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హారర్-కామెడీ యాక్షన్ చిత్రం `ది రాజా సాబ్` విడుదల కోసం ప్రభాస్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
హిందీలో ఫాల్కే బయోపిక్?
బాలీవుడ్ లోను మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కథనాలొచ్చాయి. రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి సమాచారం అందాల్సి ఉంది. హిరాణీ ప్రస్తుతం స్క్రిప్టుపై పని చేస్తున్నారని గుసగుసలు ఉన్నాయి.
