Begin typing your search above and press return to search.

య‌ధా విధిగా దించేసి సంచ‌ల‌నం సృష్టించిన చిత్ర‌మ‌ది!

ఆయన హిందీ వెర్షన్ చూసిన తర్వాత తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా క్లైమాక్స్ , కొన్ని కీలక సన్నివేశాలను మార్చాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు.

By:  Srikanth Kontham   |   19 March 2026 10:23 AM IST
య‌ధా విధిగా దించేసి సంచ‌ల‌నం సృష్టించిన చిత్ర‌మ‌ది!
X

న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ నటించిన ఆరాధన తెలుగు చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌ చరిత్రలో ఒక‌ అపురూపమైన కావ్యం. అద్భుతమైన సంగీతం, గుండెలను హత్తుకునే భావోద్వేగాలతో అప్ప‌టి ప్రేక్ష‌కుల్ని క‌ట్టిపడేసిన చిత్ర‌మిది. ఎన్టీఆర్-వాణిశ్రీల అద్భుత నటనతో అప్పట్లోనే ఓ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. సలీల్ చౌదరి అందించిన మధురమైన పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఒక మూగవాడి ప్రేమకథను వెండితెరపై ఎంతో అందంగా ఆవిష్కరించిన చిత్రం, బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించి అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

నిజానికి ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం `గీత్`కి కు అధికారిక రీమేక్. హిందీలో రాజేంద్ర కుమార్, మాలా సిన్హా నటించిన చిత్రం అక్క‌డా సంగీత పరంగా పెద్ద విజయం సాధించింది. అయితే తెలుగు నిర్మాత పుండరీ కాక్షయ్య ఈ కథలోని ఆత్మను అలాగే తెలుగులోకి తీసుకురావాలని భావించారు. అగ్ర నటుడు ఎన్టీఆర్‌ను ఒప్పించి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. అయితే సినిమా నిర్మాణం ప్రారంభంలోనే ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. మొదట ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు సిద్ధమయ్యారు.

ఆయన హిందీ వెర్షన్ చూసిన తర్వాత తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా క్లైమాక్స్ , కొన్ని కీలక సన్నివేశాలను మార్చాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. దర్శకుడిగా తన మార్క్ ఉండేలా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేస్తేనే? సినిమా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నిర్మాత పుండరీకాక్షయ్య మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. హిందీలో గీత్ ఎంతటి ఘన విజయం సాధించిందో? అదే మ్యాజిక్‌ను తెలుగులోనూ రిపీట్ చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

దీంతో ఉన్నది ఉన్నట్లుగా తీస్తేనే ఆ ఫీల్ వస్తుందని న‌మ్మారు. మార్పులు చేస్తే కథ దెబ్బతింటుందన్నారు. అలా ఆయన గట్టిగా వాదించారు. ఈ విషయంలో దర్శకుడికి- నిర్మాతకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తన సృజనాత్మకతకు చోటు లేదని భావించిన కె. విశ్వనాథ్ గౌరవంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దర్శకుడు ఎగ్జిట్ అయిన తర్వాత ఆ బాధ్యతలను బి.వి. ప్రసాద్ స్వీకరించారు. నిర్మాత ఆశయానికి తగ్గట్టుగా ఆయన హిందీ గీత్ ఎక్కడా మార్చకుండా సీన్ టు సీన్ యథావిధిగా తెలుగులో తెరకెక్కించారు. ఎన్టీఆర్ మూగవాడి పాత్రలో ప్రాణం పోయగా? వాణిశ్రీ తన అభినయంతో ఆకట్టుకున్నారు.

సంగీత దర్శకుడు సలీల్ చౌదరి హిందీలోని ట్యూన్స్‌నే తెలుగులోనూ ఉపయోగించి మ్యాజిక్ చేశారు. ఉన్నది ఉన్నట్లుగా దించేసినా? ఆ కథలోని బలం వల్ల తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆరాధన చిత్రం ద్వారా ఒక రీమేక్ సినిమాను ఎలా హ్యాండిల్ చేయాలో ?బి.వి. ప్రసాద్ నిరూపించారు. కె. విశ్వనాథ్ తప్పుకున్నా? నిర్మాత నమ్మకం వమ్ము కాలేదు. ఒక క్లాసిక్ కథను యథాతథంగా తీసి కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించవచ్చని ఈ సినిమా నిరూపించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని నా ప్రాణ స్నేహితుడు `, `నేడే ఈ రోజే వంటి పాటలు వింటుంటే ఆనాటి మధుర స్మృతులు కళ్ళముందు కదలాడుతుంటాయి.