నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..
ఒక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు మూడు వారాలు థియేటర్లలో మంచి వసూళ్లు సాధించాలని నిర్మాతలు కోరుకుంటారు.
By: M Prashanth | 3 Nov 2026 11:39 PM ISTఒక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు మూడు వారాలు థియేటర్లలో మంచి వసూళ్లు సాధించాలని నిర్మాతలు కోరుకుంటారు. కానీ ఈ నవంబర్‌లో ఆ అవకాశం ఎంతమందికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రతి వారం ఒకటికి మించి సినిమాలు వస్తున్నాయి. పైగా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి. ఒక సినిమా పుంజుకునేలోపే మరో సినిమా థియేటర్లలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
నవంబర్ 5న రణబీర్ కపూర్, యష్ నటించిన 'రామాయణం' విడుదల కానుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి థియేటర్లు దక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత నవంబర్ 12న శర్వానంద్ 'భోగి' రాబోతోంది. అంటే రామాయణం మంచి టాక్ తెచ్చుకుంటే రెండో వారంలోనూ దానికి డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయంలో భోగికి ఎన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటాయనేది కీలకం.
మరోవైపు శర్వానంద్‌కు 'భోగి' చాలా ముఖ్యమైన సినిమా. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో మాస్ మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. అదే వారంలో సుడిగాలి సుధీర్ 'గోట్', 'దొంగ నా కొడుకు', 'ఇట్లు అర్జున' వంటి సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో ఏ సినిమాకు మంచి టాక్ వచ్చినా థియేటర్ల విషయంలో పోటీ తప్పదు. ముఖ్యంగా చిన్న సినిమాలకు మొదటి వారంలోనే మంచి వసూళ్లు రావాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఇక నవంబర్ 19న విశ్వక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' విడుదల కానుంది. తొలి భాగానికి యూత్‌లో ఉన్న క్రేజ్ ఈ సీక్వెల్‌కు అడ్వాంటేజ్. అయితే దానికి మరుసటి రోజే దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' రాబోతోంది. ధనుష్ 'ఓం' కూడా అదే తేదీకి షెడ్యూల్ అయింది. దీంతో మూడో వారంలో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మూడు సినిమాలు పోటీపడే అవకాశం ఉంది.
సాధారణంగా మంచి టాక్ వచ్చిన చిన్న సినిమాలు రెండో వీకెండ్లో కూడా వసూళ్లు పెంచుకుంటుంటాయి. కానీ నవంబర్ షెడ్యూల్ చూస్తే ప్రతి వారం కొత్త సినిమాలకు స్క్రీన్లు కేటాయించాల్సి ఉంటుంది. అదే సమయంలో మల్టీప్లెక్స్‌లలో డిమాండ్ ఉన్న చిత్రాలకు ఎక్కువ షోలు కొనసాగుతాయి. దీంతో ఓపెనింగ్స్ బాగున్నా రెండో వారం నుంచి థియేటర్ల సంఖ్య తగ్గే రిస్క్ ఉంది. అయితే మంచి ఆక్యుపెన్సీ సాధించే సినిమాలకు ఈ పోటీ పెద్ద సమస్య కాకపోవచ్చు.
నెలాఖరులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'హైందవ', రష్మిక 'మైసా' కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి రిలీజ్ ప్లాన్స్ మారకపోతే నవంబర్ చివరి వారం కూడా బిజీగానే ఉంటుంది. ఈ నెలలో పెద్ద సినిమాలకు భారీ ఓపెనింగ్స్ అవకాశం ఉండగా, చిన్న సినిమాలకు మంచి టాక్‌తో పాటు సరైన థియేటర్లు దొరకడం కూడా ముఖ్యం. ముఖ్యంగా 'రామాయణం' ఎంతవరకు లాంగ్ రన్ కొనసాగిస్తుందనే దానిపైనే తర్వాత వచ్చే సినిమాల స్క్రీన్ కేటాయింపులు కొంతవరకు ఆధారపడనున్నాయి.
