Begin typing your search above and press return to search.

భారతీయ-కరేబియన్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో లండన్ షేక్!

లండన్ వీధుల్లో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే `నాటింగ్‌హిల్ కార్నివాల్` ఈసారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమైంది.

By:  Srikanth Kontham   |   29 Aug 2026 7:45 PM IST
భారతీయ-కరేబియన్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో లండన్ షేక్!
X

లండన్ వీధుల్లో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే `నాటింగ్‌హిల్ కార్నివాల్` ఈసారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక వీధి పండుగ 60 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ సంబరాలను జరుపుకుంటున్న వేళ లండన్ వీధులు ఇండో-ట్రినిడాడియన్ సంగీత ధ్వనులతో మార్మోగ బోతున్నాయి. కరేబియన్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే వేడుకల్లో భారతీయ తూర్పు ప్రాంతీయ మూలాలు, కరేబియన్ రిథమ్స్ కలగలిసిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ వజ్రోత్సవ వేడుకల్లో ప్రధానంగా ఇండో-ట్రినిడాడియన్ మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శన ప్రత్యేకంగా నిలవబోతోంది. సాంప్రదాయ కరేబియన్ సోకా , కాలిప్సో ఫ్యూజన్ సంగీతానికి భారతీయ ధోల్, తబలా , తానా పాటల సమ్మేళనం తోడవడంతో లండన్ వీధులు సరికొత్త సాంస్కృతిక సంగమానికి వేదిక కానున్నాయి. బ్రిటన్‌లో ఉన్న భారతీయ , కరేబియన్ డయాస్పోరా సంస్కృతులను ఏకం చేస్తూ మ్యూజిక్ బ్యాండ్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో సందర్శకులను ఉర్రూతలూగించనున్నాయి.

నాటింగ్‌హిల్ కార్నివాల్ 1966లో ప్రారంభమైంది. అన‌తి కాలంలో యూరప్‌లోనే అతిపెద్ద వీధి పండుగగా రూపాంతరం చెందింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా కరేబియన్ ఐక్యతను చాటడానికి ప్రారంభమైన కార్నివాల్ కాలక్రమేణా విభిన్న దేశాలు, సంస్కృతుల ప్రజలను ఒకే వేదికపైకి తెచ్చే గ్లోబల్ ఈవెంట్‌గా మారింది. 60 ఏళ్ల ఈ ప్రయాణంలో భారతీయ మూలాలున్న ట్రినిడాడియన్ ఆర్టిస్టులు భాగస్వామ్యం కావడం ఈ పండుగ దశాబ్దాలుగా సాధించిన వైవిధ్యాన్ని చాటిచెబుతోంది.

ఈ ఏడాది డైమండ్ జూబ్లీ కావడంతో మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 20 లక్షల మందికి పైగా సందర్శకులు వేడుకలకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రంగురంగుల కాస్ట్యూమ్స్, క‌ళ్లు మిరుమిట్లు గొలిపే పరేడ్‌లు , బహుళ-సంస్కృతుల సౌండ్ సిస్టమ్స్ మధ్య ఇండో-కరేబియన్ మ్యూజిక్ బిట్స్ ప్లే కావడం వేడుకల్లో సరికొత్త ఎనర్జీని నింపబోతోంది. పండుగ ప్రేమికులు మ్యూజిక్ పరేడ్‌లో ఉత్సాహంగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు.

లండన్ వంటి అంతర్జాతీయ నగరంలో భారతీయ , కరేబియన్ సంస్కృతుల కలయికతో రూపొందిన ఈ ఫ్యూజన్ మ్యూజిక్ గ్లోబల్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. సంప్రదాయ మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక పాప్ , కరేబియన్ బీట్స్‌ను మేళవించి అందిస్తున్న కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఈ నాటింగ్‌హిల్ కార్నివాల్ వజ్రోత్సవాలు వారికి ఒక అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడుతున్నాయి.