Begin typing your search above and press return to search.

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

బాలీవుడ్ నటి.. డ్యాన్సర్ నోరా ఫతేహి 200 ( సుకేష్ చంద్ర‌) కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి ఎట్టకేలకు మౌనం వీడారు.

By:  Srikanth Kontham   |   3 Nov 2026 3:04 PM IST
200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!
X

బాలీవుడ్ నటి.. డ్యాన్సర్ నోరా ఫతేహి 200 ( సుకేష్ చంద్ర‌) కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి ఎట్టకేలకు మౌనం వీడారు. గత కొంతకాలంగా నోరా చుట్టూ అలుముకున్న అనేక అనుమానాలకు.. ఊహాగానాలకు తెరదించుతూ ఆమె లీగల్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో నోరా ఫతేహిపై ఎలాంటి నేరారోపణలు లేవని, ఆమెను కేవలం ఒక సాక్షిగా మాత్రమే న్యాయస్థానం పిలిచిందని ఆమె తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.

ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం జరిగిన విచారణ. 200 కోట్ల డిఫెన్స్ అండ్ ఎక్స్‌టార్షన్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారణను చేపట్టింది. ఈ నేపథ్యంలో నోరా ఫతేహికి న్యాయస్థానం నుంచి సమన్లు జారీ అయ్యాయి. అయితే అతి తక్కువ సమయంలో సమన్లు అందడం వల్ల ముందస్తు వృత్తిపరమైన కట్టుబాట్ల కారణంగా నోరా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు.

నోరా తరఫు న్యాయవాదులు కోర్టులో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఆమె వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టులో ప్రత్యేక దరఖాస్తును దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అలాగే నోరా తదుపరి విచారణకు హాజరు కావడానికి వీలుగా తాజాగా మరోసారి సమన్లను జారీ చేసింది.

ఈ సందర్భంగా నోరా లీగల్ టీమ్ మీడియా ద్వారా ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ మొత్తం ప్రొసీడింగ్స్‌లో నోరా ఫతేహి ఏ కోణంలోనూ నిందితురాలు కాదని.. ఎలాంటి తప్పు చేయలేదని తేల్చిచెప్పింది. ఆమెపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు .. ఆరోపణలు లేవని.. కేవలం విచారణలో కోర్టుకు సహాయపడేందుకు ఒక సాక్షిగా మాత్రమే ఆమె పేరు ఉందనే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు.

గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి నోరా ఫతేహీ ఈడీ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా మరియా పాల్‌తో ఉన్న పరిచయాలు, గిఫ్ట్‌ల లావాదేవీలపై ఆమె స్టేట్‌మెంట్‌ను సెక్షన్ 164 కింద రికార్డు చేశారు. ఆ విచారణల ఆధారంగానే సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో ఆమెను ప్రాసిక్యూషన్ సాక్షిగా చేర్చినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

మొత్తానికి నోరా ప‌టేహీపై వస్తున్న నిరాధారమైన ప్రచారాలకు ఈ అధికారిక ప్రకటన ద్వారా పూర్తి గా చెక్ పెట్టారు. నోరా చట్టానికి పూర్తి గౌరవం ఇస్తానని.. విచారణకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపింది . నవంబర్ 6న జరిగే తదుపరి విచారణలో నోరా ప‌టేహీ న్యాయస్థానం ముందు హాజరై త‌న వాంగ్మూలాన్ని మరింత స్పష్టం చేసే అవకాశం ఉంది.