ఎవరినీ బాధపెట్టాలనుకోలేదు.. వివాదాస్పద సాంగ్‌పై నోరా ఎమోషనల్ కామెంట్స్
ఈ వివాదానికి సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహి గురువారం జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 May 2026 12:00 AM ISTకన్నడ పాన్ ఇండియా సినిమా KD: ది డెవిల్ లోని సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ చుట్టూ నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా మరోసారి సినీ పరిశ్రమలో కంటెంట్ బాధ్యతపై చర్చకు దారితీసింది. ఈ వివాదానికి సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహి గురువారం జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. వివాదాస్పద పాట కారణంగా ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమాపణలు చెబుతున్నానని, ఒక ఆర్టిస్ట్‌గా తనకు ఉన్న బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకున్నానని ఆమె తెలిపారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, కానీ కళాకారిణిగా సమాజంపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ నోరా పేర్కొన్నారు.
ఈ సాంగ్ హిందీ వెర్షన్ రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సాంగ్ లోని సాహిత్యం, చిత్రీకరణ తీరు అసభ్యకరంగా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది రోజులకే ఈ వీడియోపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నిర్మాతలు హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. అయినప్పటికీ ఆ సాంగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ స్వయంగా కేసును పరిశీలించి నోరా ఫతేహీతో పాటు సంజయ్ దత్, లిరిసిస్ట్ రఖీబ్ ఆలం, నిర్మాత వెంకట్ కె నారాయణ, డైరెక్టర్ కిరణ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది.
జాతీయ మహిళా కమిషన్ ప్రకారం ఈ పాట లైంగికంగా అభ్యంతరకర సంకేతాలు కలిగినదిగా కనిపిస్తోందని, ఇది భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం, అలాగే పోక్సో చట్టంలోని కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశముందని పేర్కొంది. ఈ వివాదం నేపథ్యంలో నోరా ఫతేహీ ఒక సామాజిక కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. అనాథ బాలికల విద్య కోసం తాను ఆర్థిక సహాయం అందిస్తానని వెల్లడించారు. ఈ ఘటన తనకు చాలా విషయాలు నేర్పిందని, సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆమె అన్నారు.
ఇదే కేసులో ఇప్పటికే సంజయ్ దత్ కూడా NCW ఎదుట హాజరై క్షమాపణలు తెలిపారు. ఆయన కూడా సవరణ చర్యలలో భాగంగా 50 మంది గిరిజన బాలికల విద్య బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. మరోవైపు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ వివాదాస్పద పాటపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దానిపై నిషేధం అమలులోకి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన సినీ పరిశ్రమలో సృజనాత్మక స్వేచ్ఛ, సామాజిక బాధ్యత మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న అంశంపై విస్తృత చర్చకు కారణమవుతోంది.
