Begin typing your search above and press return to search.

అతి ఫెమినిజం సమాజాన్ని పాడుచేసింది.. వివాదంపై నోరా క్లారిటీ

మహిళా స్వయం ప్రతిపత్తి.. భాగస్వామ్యం మధ్య ఉండాల్సిన అండ‌ర్ స్టాండింగ్ గురించి నోరా కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Sivaji Kontham   |   11 April 2026 12:00 PM IST
అతి ఫెమినిజం సమాజాన్ని పాడుచేసింది.. వివాదంపై నోరా క్లారిటీ
X

వ‌రుస వివాదాల్లో నోరా ఫ‌తేహి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఐట‌మ్ పాట‌ల స్పెష‌లిస్ట్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి గతంలో ఫెమినిజంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఇటీవల ఒక అంతర్జాతీయ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తన మాటలను సోషల్ మీడియాలో చిన్న చిన్న క్లిప్పులుగా కత్తిరించి వక్రీకరించారని, దీనివల్ల తాను చెప్పదలుచుకున్న అసలు అర్థం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయంలోనైనా అతివాదాన్ని లేదా తీవ్రవాదాన్ని తాను వ్యతిరేకిస్తానని, తన పోరాటం మహిళా హక్కులకు వ్యతిరేకం కాదని నోరా స్పష్టం చేశారు.

కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ..నోరా తన వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలను ప్రస్థావిస్తూ.. ఒక చిన్న కుటుంబంలో తల్లిదండ్రులిద్దరి సంరక్షణలో పెరగడం పిల్లల ఎదుగుదలకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. తాను ఒక సింగిల్ మదర్ వద్ద పెరగడం వల్ల చిన్నతనంలో తండ్రి లేని లోటును అనుభవించానని.. అటువంటి భావోద్వేగ గాయాలు పెద్దయ్యాక కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయని నిజాయితీగా అంగీకరించారు. అందుకే ప్రతి బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ, క్రమశిక్షణ అందాలని నోరా ఆకాంక్షించారు.

మహిళా స్వయం ప్రతిపత్తి.. భాగస్వామ్యం మధ్య ఉండాల్సిన అండ‌ర్ స్టాండింగ్ గురించి నోరా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు కచ్చితంగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని.. వారి కలలను నెరవేర్చుకోవాలని కోరుకుంటూనే జీవితంలో ఒక తోడు ఉండటం తప్పేమీ కాదని అన్నారు. ``మాకు ఎవరి అవసరం లేదు`` అనే ధోరణి కంటే.. స్వతంత్రంగా ఉంటూనే ఒకరికొకరు తోడుగా ఉండటం గొప్ప విషయమని నోరా పేర్కొన్నారు. అలాగే సమాజంలో పురుషులు కూడా మరింత జవాబుదారీతనంతో మెదలాలని.. వారు బాధ్యతాయుతమైన భాగస్వాములుగా ఉండాలని సూచించారు. అతి ఫెమినిజాన్ని తాను స‌హించ‌న‌ని కూడా నోరా అన్నారు. అలాగే పురుషులు ఇంటిని పోషిస్తే, మ‌హిళ‌లు ఆ ఇంటిలో ఉంటూ సంర‌క్షించాల‌నే పురాత‌న విధానాన్ని తాను స‌మ‌ర్థిస్తాన‌ని వ్యాఖ్యానించారు. అలాగే మ‌హిళ‌లు మంచి ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల‌ని కూడా అన్నారు. అయితే ఫెమినిజానికి వ్య‌తిరేకంగా ఈ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని కొంద‌రు మ‌హిళ‌లు సోషల్ మీడియాల్లో విరుచుకుప‌డ్డ త‌ర్వాత ఈ వివాదం రాజుకుంది.

ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే.. నోరా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్నారు. ఇటీవల ఈ భామ‌ విడుదల చేసిన `వాట్ డు ఐ నో?` అనే సింగిల్ గ్లోబల్ చార్ట్స్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా అమెరికాలోని ప్రసిద్ధ `ది టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్`లో ప్రదర్శన ఇచ్చి అంతర్జాతీయ గుర్తింపు పొందిన అతికొద్ది మంది భారతీయ తారల్లో ఒకరిగా నిలిచారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. గతంలో బాహుబలి, టెంపర్ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో గుర్తింపు పొందారు. సరైన స్క్రిప్ట్ దొరికితే టాలీవుడ్‌లో పూర్తి స్థాయి పాత్రలు చేయడానికి నోరా ఆసక్తిగా ఉన్నారు.

సినిమాలతో పాటు రియాలిటీ షోల రంగంలో నోరా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఝలక్ దిఖ్‌లా జా, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్, హిప్ హాప్ ఇండియా వంటి పాపులర్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. తనదైన డ్యాన్స్ శైలి.. స్పష్టమైన అభిప్రాయాలతో బుల్లితెరపై తనదైన‌ ముద్ర వేస్తున్నారు. కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా.. కథానాయికగా `మడ్గావ్ ఎక్స్‌ప్రెస్` వంటి చిత్రాలతో తన నటనను కూడా నిరూపించుకుంటూ ప్ర‌పంచ స్థాయిలో తానేంటో నిరూపిస్తున్నారు. క‌న్న‌డ చిత్రం కేడి- ది డెవిల్ లో నోరా ఫ‌తేహి న‌టించారు. అలాగే లారెన్స్ మాస్టార్ కాంచ‌న 4లోను నోరా న‌టిస్తోంది. కేడి ది డెవిల్ చిత్రంలోని ఒక వివాదాస్ప‌ద పాట కార‌ణంగా నోరా ఫ‌తేహి పేరు ఇటీవ‌ల మార్మోగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ పాట‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించారు.