నోరా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం
ముఖ్యంగా నోరా ఫతేహి డ్యాన్సర్ గా క్రియేటివ్ గా ఆలోచిస్తుంది. అప్పటికప్పుడు స్టెప్పులు క్రియేట్ చేయగలదు.
By: Sivaji Kontham | 20 Aug 2025 8:15 AM ISTనోరా ఫతేహి పరిచయం అవసరం లేదు. బాహుబలిలో మనోహరి పాటలో మరో ఇద్దరు అందగత్తెల మధ్య స్పెషలిస్ట్ డ్యాన్సర్ గా హైలైట్ అయింది నోరా. వీరుడిని అయినా వలపు వలలోకి లాగేసే ఖిలేడీలా కనిపించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టెంపర్ లో అదిరిపోయే ఐటమ్ పాటతో మతులు చెడగొట్టింది. హిందీలో పలు భారీ హిట్ నంబర్లతో అలరించిన నోరా, సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్రలతోను మెప్పిస్తోంది. ముఖ్యంగా మాస్ కి హిస్టీరియా పుట్టించే తెగువ నోరాలో కనిపిస్తుంది.
అయితే నోరా ఈరోజు అందుకున్న స్టార్ డమ్ అంత సులువుగా దక్కింది కాదు. అంతకుముందు కెనడా, అమెరికాలో పలు ఉద్యోగాలు చేసానని చెప్పింది నోరా. షాపింగ్ మాల్స్ లో సేల్స్ గాళ్ గా పని చేసింది. బార్ టెండర్ గా, రెస్టారెంట్ లో వెయిటర్ గాను పని చేసింది. డ్యాన్సర్ గా అవతారం ఎత్తింది. కుటుంబాన్ని పోషించేందుకు చాలా సాహసాలే చేసింది.
అదంతా అటుంచితే, నోరా ఫతేహిలో ఉన్న ఒకే ఒక్క లక్షణం ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగేందుకు సహకరించింది. ఆ ఒక్క లక్షణం... ఎవరో ఏదో అనుకుంటారని ఫీలవ్వడం లేదా, ఇరుగు పొరుగు కోసం తాను ఏదో అవ్వాలనుకోవడం కాదు.. తాను నిజానికి ఏం కావాలనుకుంటోందో స్పష్ఠంగా తెలిసిన దానిగా, నేరుగా డ్యాన్స్ బేస్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొరాకో గ్రూప్ డ్యాన్సర్లతో కలిసి పని చేసిన అనుభవం ఇక్కడ ప్రత్యేకంగా కలిసొచ్చింది.
ముఖ్యంగా నోరా ఫతేహి డ్యాన్సర్ గా క్రియేటివ్ గా ఆలోచిస్తుంది. అప్పటికప్పుడు స్టెప్పులు క్రియేట్ చేయగలదు. బీట్ ని అనుసరించి పాటలు కూడా పాడగలదు. పాడుతూ ఆడగలదు. ప్రతి నిమిషం క్రియేటివిటీతో మెప్పిస్తుంది. అందుకే ఈరోజు భారతీయ సినీపరిశ్రమలో, రియాలిటీ టీవీ పరిశ్రమలో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ క్వీన్ గా వెలిగిపోతోంది. నోరా మ్యామ్ అంటూ దేశవ్యాప్తంగా కొరియోగ్రఫీపై పిచ్చి ప్రేమ పెంచుకున్న ప్రతి ఒక్కరూ తనకు ఇస్తున్న గౌరవం చూస్తుంటే ముచ్చట కలుగుతుంది. ఎక్కడో విదేశీ గడ్డ పై నుంచి వచ్చి భారతదేశంలో ఇంతటి గౌరవం అందుకుంటోంది. నోరాను మించిన డ్యాన్సింగ్ ట్యాలెంట్ భారతదేశంలో చాలా ఉంది. కానీ వారంతా నోరాలా ఏటికి ఎదురీది అనుకున్నది సాధించుకోగలరా? అన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే! ప్రతిదానికి సిగ్గుపడుతూ, మొహమాట పడుతూ, సాధించగలమా లేదా అని ఆలోచిస్తూ, వెనకడుగు వేస్తూ, ఎలాంటి ప్రయత్నమూ చేయని వారికి ఎప్పటికీ విజయం సిద్ధించదు!
