నోలాన్ ముంబైలో అడుగుపెడుతుంటే హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌కు ఒణుకు!
ఇప్పటివరకూ ఎంతోమంది అంతర్జాతీయ పాప్ స్టార్లు, హాలీవుడ్ నటులు భారతదేశంలో అడుగుపెట్టారు. వారందరికీ ఇక్కడి అభిమానులు ఎల్లప్పుడూ ఘనస్వాగతం పలుకుతూ.. తమ అభిమానంలో ముంచెత్తుతూనే ఉంటారు.
By: Sivaji Kontham | 17 Jun 2026 9:00 PM ISTఇప్పటివరకూ ఎంతోమంది అంతర్జాతీయ పాప్ స్టార్లు, హాలీవుడ్ నటులు భారతదేశంలో అడుగుపెట్టారు. వారందరికీ ఇక్కడి అభిమానులు ఎల్లప్పుడూ ఘనస్వాగతం పలుకుతూ.. తమ అభిమానంలో ముంచెత్తుతూనే ఉంటారు. అయితే మునుపెన్నడూ చూడని విధంగా ఒక పాప్ స్టార్‌కో లేదా ఒక గ్లామరస్ హీరోయిన్‌కో దక్కే స్థాయి క్రేజ్ ఇప్పుడు ఒక హాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు దక్కుతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక విదేశీ దర్శకుడికి ఈ స్థాయి గ్రాండ్ వెల్‌కమ్ లభించడం బహుశా ఇదే మొదటిసారి. ఆ క్రేజ్ మరెవరికో కాదు.. తన మేధోతనం, విలక్షణమైన ఆలోచనలు- సినిమాటిక్ టెక్నిక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్‌కే ఇది సాధ్యమైంది.
నోలాన్ తన సరికొత్త మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ మూవీ `ది ఒడిస్సీ`గ్లోబల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ జూలైలో నేరుగా ముంబైలో అడుగుపెట్టబోతున్నారు. నోలాన్‌తో పాటు ఈ చిత్రంలోని ప్రధాన నటులు మాట్ డామన్, టామ్ హాలండ్, ఆస్కార్ అవార్డు గ్రహీత- నిర్మాత ఎమ్మా థామస్ కూడా భారత్‌కు రానున్నారు. క్రిస్టోఫర్ నోలాన్ కెరీర్‌లోనే ఒక సినిమా ప్రీమియర్ షో అధికారికంగా భారతదేశంలో జరగనుండడం ఇదే ప్రథమం కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అతడిని దగ్గరగా చూసి తరించేందుకు టాలీవుడ్ (హైదరాబాద్) నుంచి అతడి ఫ్యాన్స్ ముంబైకి బయల్దేరుతున్నారు. ఒక దర్శకుడి మేకింగ్ స్టైల్‌ను, అతడి ఆలోచనల్లోని సృజనాత్మకతను చూసి మన దేశంలో ఇంతగా ఆరాధించడం నిజంగా విశేషం.
హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ `యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్` లండన్, పారిస్, న్యూయార్క్ నగరాల సరసన ముంబైని కూడా `ది ఒడిస్సీ` అధికారిక గ్లోబల్ ప్రీమియర్ టూర్ వేదికగా ఎంపిక చేయడం విశేషం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 17న థియేటర్లలోకి రానుంది. సరికొత్త ఐమ్యాక్స్ ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతోనే షూట్ చేసిన మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ఇది రికార్డు సృష్టించబోతోంది. ముంబైలోని ప్రముఖ పీవీఆర్ ఐకాన్ ఐమ్యాక్స్ ఫోనిక్స్ పల్లాడియమ్ లో ఈ చారిత్రాత్మక ఇండియా ప్రీమియర్ ఘనంగా జరగనుంది.
ఈ భారీ చిత్రంలో హాలీవుడ్ అగ్ర తారలైన మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపితా న్యాంగో, సమంతా మోర్టన్, జెండయా, చార్లిజ్ థెరాన్ వంటి ఎంతోమంది అగ్రతారలు నటించారు. నోలాన్ తన సొంత నిర్మాణ సంస్థ సింకోపి బ్యానర్‌పై భార్య ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రాయ్ పతనం తర్వాత ఒడిస్సియస్ తన స్వగృహానికి చేరుకోవడానికి చేసిన దశాబ్ద కాలపు సుదీర్ఘ మహా ప్రయాణాన్ని (హోమర్ రాసిన పురాణ గాథ ఆధారంగా) నోలాన్ తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. హాలీవుడ్ చరిత్రలోనే భారతదేశంలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌గా ఈ ముంబై ప్రీమియర్ నిలవనుంది.
ఇక ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా ఉన్న ఐమ్యాక్స్ థియేటర్లలో `ది ఒడిస్సీ` సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టిక్కెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. నోలాన్ మేధోతనం నుండి పుట్టుకొచ్చిన ఈ విజువల్ వండర్‌ను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా? అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 17న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నోలాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాయడం ఖాయం. దానికి మించి భారతదేశంలో అదిరిపోయే వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక పాప్ స్టార్‌ను మించిన ఫాలోయింగ్‌తో ముంబైలో అడుగుపెడుతున్న క్రిస్టోఫర్ నోలాన్ రాక కోసం ఇప్పుడు యావత్ భారతదేశం ఆసక్తిగా వేచి చూస్తోంది. ముఖ్యంగా నోలాన్ ముంబైలో అడుగుపెడుతుంటే హైదరాబాద్ ఫ్యాన్స్ లో ఒణుకు మొదలైంది. తమ ఫేవరెట్ నోలాన్ ని కలుసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారు. నోలాన్ తెరకెక్కించిన ఇన్ సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, ఓపెన్ హీమర్ టెక్నిక్స్ గురించి అడిగి తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారు!! అయితే నోలాన్ లాంటి అంతర్జాతీయ దర్శకుడికి ఉండే ప్రోటోకాల్ అసాధారణమైనదని గమనించాలి.
