భన్సాలీ 'లవ్ అండ్ వార్' డిలేకి షాకింగ్ రీజన్?
అయితే ఈ సినిమా ఏడాదిన్నరగా ఫుల్ స్వింగ్ లో తెరకెక్కుతున్నా రిలీజ్ ఆలస్యమవుతుండడంపై రకరకాల పుకార్లు వినిపించాయి.
By: Sivaji Kontham | 5 Jan 2026 9:38 AM IST2026 మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న 'లవ్ అండ్ వార్' ఒకటి. ఇది భన్సాలీ మార్క్ సినిమాలకు కొంత భిన్నంగా వార్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న పీరియడ్ ప్రేమకథా చిత్రం. దీనిని కమర్షియల్ అంశాలతో పర్ఫెక్ట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారని గుసగుసలు వినిపించాయి. సీరియస్ వార్ నేపథ్యంలో ముక్కోణపు ప్రేమకథ రక్తి కట్టించనుందని సమాచారం.
అయితే ఈ సినిమా ఏడాదిన్నరగా ఫుల్ స్వింగ్ లో తెరకెక్కుతున్నా రిలీజ్ ఆలస్యమవుతుండడంపై రకరకాల పుకార్లు వినిపించాయి. గతంలో ప్రధాన తారల మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దాని కారణంగానే భన్సాలీ సినిమా విడుదల ఆలస్యం చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఆలియా భట్, రణబీర్, విక్కీ కౌశల్ మధ్య ఘర్షణ ఏమిటన్నదానిపై సరైన సమాచారం లేదు. తాజాగా మిడ్-డే తన కథనంలో అన్ని పుకార్లను కొట్టి పారేసింది. ఈ చిత్రం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోందని వెల్లడించింది.
ఇటీవల 2025 ముగింపు ఉత్సవాల కోసం ముందుగా నిర్ణయించిన విధంగానే చిత్రబృందం విరామంలో ఉంది. ఇది కొన్ని నెలల క్రితం తీసుకున్న నిర్ణయం అని మిడ్ డే పేర్కొంది. ''వాస్తవానికి భన్సాలీ సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కుతాయి గనుక .. చిన్న చిన్న ఆలస్యాలు సహజం. కానీ ఏ చిన్న విరామాన్నైనా వెంటనే ఆలస్యంగా చూస్తారు'' అని నిర్మాణ సంస్థ సన్నిహితులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇది ఒక పీరియడ్ చిత్రం కాబట్టి ప్యాచ్‌వర్క్, కొన్ని ఎంపిక చేసిన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వీఎఫ్ ఎక్స్ పనులు సహా మ్యూజిక్ కి సంబంధించిన పనుల్ని భన్సాలీ పూర్తి చేయాల్సి ఉంది.
ఈ సినిమాలో నటిస్తున్న లీడ్ పాత్రధారులు రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే దానిలో వాస్తవం ఎంత? అనేదానిపై ఆరా తీస్తే, ''వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు.. అవన్నీ పుకార్లు మాత్రమే''నని చిత్రబృందం ఖండిస్తోంది. స్టార్లు సుదీర్ఘమైన శ్రమతో కూడిన షూటింగ్‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వారంతా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.. పనికి కట్టుబడి నిబద్ధతతో ఉన్నారు. వారు జనవరి మధ్యలో షూటింగ్ తిరిగి ప్రారంభించి మార్చి వరకు కొనసాగిస్తారు. అదే సమయంలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతాయి అని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ చిత్రం 2025 క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా విడుదల తేదీ మార్చి 20 నాటికి వాయిదా పడిందని గుసగుసలు వినిపించాయి. కానీ చిత్రబృందం అధికారికంగా ఇంకా కొత్త తేదీని ప్రకటించలేదు.. అలాగని రిలీజ్ వాయిదాను ధృవీకరించలేదు.
ఒక సోర్స్ ప్రకారం.. లవ్ అండ్ వార్ చిత్రీకరణకు ఇంకా 75 రోజులు పడుతుంది. షెడ్యూల్స్ ఆశించినంత వేగంగా ముందుకు సాగలేదని కూడా గుసగుసలు వినిపించాయి. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి 2026 వేసవి వరకు ఎక్కువ తేదీలను కేటాయించమని సంజయ్ లీలా భన్సాలీ నేరుగా రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్‌ను కోరారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రణబీర్ నితీష్ తివారీ `రామాయణం` చిత్రీకరణతో ఫుల్ బిజీగా ఉన్నారు. అదే సమయంలో బ్లాక్ బస్టర్ `చావా` తర్వాత భారీ ప్రణాళికలతో విక్కీ బిజీ బిజీగా ముందుకు సాగుతున్నారు. ఆలియా భట్ యష్ రాజ్ ఫిలింస్ స్పై యాక్షన్ మూవీ `ఆల్ఫా` చిత్రీకరణతో బిజీగా ఉంది. రామాయణం, ఆల్ఫా చిత్రాలు ఈ ఏడాది విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ సమయంలో స్టార్లు తమ కాల్షీట్లపై మరింత స్పష్టంగా ముందుకు రావాల్సి ఉంటుందని కథనాలొస్తున్నాయి. భన్సాలీ మూవీ సజావుగా ఈ వేసవికి విడుదలైతే వీక్షించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ రిలీజ్ తేదీపై అధికారికంగా స్పష్ఠత రావాల్సి ఉంది.
