Begin typing your search above and press return to search.

నైజాంలో పోటీ తప్పదా? ఏం జరుగుతుందో?

అయితే నైజాంలో ఎస్వీసీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే కొన్నేళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న ఆ సంస్థ.. అనేక సినిమాలు రిలీజ్ చేసింది. భారీ లాభాలను ఆర్జించింది.

By:  M Prashanth   |   4 Feb 2026 11:15 PM IST
నైజాంలో పోటీ తప్పదా? ఏం జరుగుతుందో?
X

నైజాం డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దే హవా. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏకఛత్రాధిపత్యం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నైజాం మార్కెట్ లోకి మైత్రీ మూవీ మేకర్స్ అడుగుపెట్టింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

దీంతో నైజాం మార్కెట్ లో పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. శ్రీవెంకటేశ్వర వర్సెస్ మైత్రీ వర్సెస్ అన్నపూర్ణ అన్నట్లు ఇకపై ఉండనుందని అర్థమవుతోంది. అయితే నైజాంలో ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉండడం.. ప్రొడ్యూసర్లకు మంచి లాభం చేకూర్చే విషయమే. ఎందుకంటే గట్టి పోటీ ఉంటేనే.. అడ్వాన్స్ లు, నాన్- రీఫండబుల్ అమౌంట్లు పెద్ద ఎత్తున్న నిర్మాతలకు వచ్చే అవకాశం ఉంది.

అయితే నైజాంలో ఎస్వీసీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే కొన్నేళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న ఆ సంస్థ.. అనేక సినిమాలు రిలీజ్ చేసింది. భారీ లాభాలను ఆర్జించింది. తన చేతుల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ అట్టిపెట్టుకుందని ఎప్పుడూ టాక్ వినిపిస్తుంటుంది. అదే సమయంలో మైత్రీ సంస్థ.. ఇటీవల కొన్ని భారీ సినిమాలను రిలీజ్ చేసి విజయాలు అందుకుంది.

కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కొన్నా.. కొంతమేర ఎస్వీసీకి మాత్రం పోటీ ఇస్తుందని చెప్పాలి. సలార్, పుష్ప -2 వంటి సినిమాలను పెద్ద ఎత్తున థియేటర్స్ లో విడుదల చేసి సత్తా చాటింది. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఎంట్రీతో అటు ఎస్వీసీకి.. ఇటు మైత్రీకి పోటీ మాత్రం తప్పదేమో. ఎందుకంటే.. అప్పుడే అన్నపూర్ణ సంస్థకు అనేక మంది నిర్మాతలు సపోర్ట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

చినబాబు, నాగవంశీ, సాహు గారపాటి, బీవీఎస్ఎన్ ప్రసాద్, స్వప్న దత్, ప్రియాంక దత్, సతీష్ కిలారు సహా పలువురు ప్రొడ్యూసర్లు.. అన్నపూర్ణ స్టూడియోస్ వైపు ఇప్పుడు మొగ్గు చూపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎస్వీసీలో కీలక భాగస్వామి అయిన సునీల్ నారంగ్ కూడా సపోర్ట్ చేస్తున్నారని వినికిడి. దీని బట్టి చూస్తుంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్టివ్ మోడ్ లో ఉన్న ఎక్కువ మంది బడా నిర్మాతలు అన్నపూర్ణ సంస్థకు మద్దతు ఇస్తున్నారని చెప్పవచ్చు.

దీంతో ఎస్వీసీకి అది పెద్ద షాక్ కాగా.. మైత్రీకి చిన్నపాటి షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్.. మైత్రీతో కలిస్తే ఫుల్ స్ట్రాంగ్ అవుతుందని అంచనాలు ఉన్నా.. అలా జరగదు. దీంతో నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో త్రిముఖ పోరు ఖాయంలానే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎస్వీసీ, మైత్రీ, అన్నపూర్ణ మధ్య పోటీ ఎలా ఉంటుందో.. నైజాం మార్కెట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో.. మరేం జరుగుతుందో వేచి చూడాలి.