Begin typing your search above and press return to search.

మాలీవుడ్ హిట్.. తెలుగులో కూడా అదరగొట్టేస్తుందా?

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం సర్వం మాయ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది.

By:  M Prashanth   |   30 Jan 2026 3:34 PM IST
మాలీవుడ్ హిట్.. తెలుగులో కూడా అదరగొట్టేస్తుందా?
X

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం సర్వం మాయ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వచ్చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌ స్టార్ ఆ చిత్రాన్ని జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది.

మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్ అయిన ఆ సినిమా.. తెలుగులో డబ్ అవుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఓటీటీలో మాత్రం తెలుగులో అందుబాటులోకి రాగా.. మంచి స్పందన తెచ్చుకుంటోంది. టాలీవుడ్ సినీ ప్రియులను మెప్పిస్తోంది.

ఆడియన్స్ నుంచి ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో.. తెలుగులో కూడా ఫాంటసీ ఎంటర్టైనర్ అదరగొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి చూసే ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రంగా సర్వం మాయ ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు. మరో మాలీవుడ్ జెమ్ అని కొనియాడుతున్నారు. అందరూ చూడాలని.. కచ్చితంగా ఆకట్టుకుంటుందని రివ్యూస్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో రూపొందిన సర్వం మాయ గత ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌ లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.145 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మాలీవుడ్‌ లో కొత్త రికార్డులు సృష్టించిన చిత్రంగా నిలిచింది. ప్రేమమ్ తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నివిన్ పౌలీకి మంచి కంబ్యాక్‌ గా మారింది.

కథ విషయానికి వస్తే.. ప్రభేందు (నివిన్ పౌలీ) ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అయితే అతడు దేవుడిని నమ్మడు. తండ్రి, అన్నల మాదిరిగా పౌరోహిత్యం చేయకుండా గిటారిస్ట్‌ గా కెరీర్ నిర్మించుకోవాలని కలలు కంటాడు. స్టేజ్ షోలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సొంతూరికి రావాల్సి వస్తుంది. ఖాళీగా ఉండకుండా డబ్బుల కోసం బావ రూపేష్ (అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేయడం మొదలుపెడతాడు.

ఈ క్రమంలో ఓ ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని తరిమేస్తాడు. అయితే ఆ తర్వాత నుంచి ఓ ఆడ దెయ్యం ప్రభేందును వెంటాడడం ప్రారంభిస్తుంది. ఆ దెయ్యం అతనికి మాత్రమే కనిపిస్తుంది, అతడితోనే మాట్లాడుతుంది. తన గతం, తాను ఎవరో, ఎలా చనిపోయానో ఏమీ గుర్తుండదు. దీంతో ప్రభేందు ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. ఆ తర్వాత డెలులు కారణంగా ప్రభేందు జీవితంలో జరిగే మార్పులు, ఆమె అసలు కథ ఏంటి, చివరికి ఏమవుతుందనే అంశాల చుట్టూ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.