Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ఛాన్స్.. హీరోయిన్లకు ఎంత కలిసొచ్చింది!

త్రివిక్రమ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ల కెరీర్ చూస్తే ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తాయి.

By:  M Prashanth   |   2 Nov 2026 12:00 AM IST
త్రివిక్రమ్ ఛాన్స్.. హీరోయిన్లకు ఎంత కలిసొచ్చింది!
X

త్రివిక్రమ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ల కెరీర్ చూస్తే ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తాయి. సమంత, పూజా హెగ్డే లాంటి వాళ్లు ఆయనతో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు. కానీ మరికొందరికి పెద్ద సినిమా అవకాశం వచ్చినా ఆ తర్వాత కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'లో నివేదా పేతురాజ్ మళ్లీ కనిపించడంతో ఈ విషయం గుర్తుకొస్తోంది. ఇంతకీ త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశాలు ఎవరికి ఎంతవరకు ఉపయోగపడ్డాయనేది చూస్తే కొన్ని భిన్నమైన ఉదాహరణలున్నాయి.

2020లో 'అల వైకుంఠపురములో'లో కనిపించిన నివేదా, ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'లో మరోసారి త్రివిక్రమ్‌తో పనిచేశారు. కానీ ఈసారి కూడా ఆమె పాత్రకు ఎక్కువ స్కోప్ లేదని కామెంట్స్ వచ్చాయి. నిజానికి 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' సినిమాల్లో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'రెడ్', 'పాగల్', 'దాస్ కా ధమ్కీ' చేసినా పెద్ద హీరోల సరసన వరుస అవకాశాలు మాత్రం దక్కలేదు.

మీనాక్షి చౌదరి విషయంలో మరోలా జరిగింది. 'గుంటూరు కారం'లో ఆమెకు సన్నివేశాలు తక్కువ. దానిపై అభిమానులు నిరాశపడ్డారని మీనాక్షి కూడా చెప్పారు. కానీ అదే ఏడాది 'లక్కీ భాస్కర్'లో సుమతిగా మంచి పాత్ర దక్కింది. ఆ సినిమా విజయంతో కొత్త అవకాశాలు వచ్చాయని ఆమె స్వయంగా వెల్లడించారు. తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం'లో పోలీస్ అధికారిగా కనిపించారు. త్రివిక్రమ్ సినిమా కంటే ఆ తర్వాత చేసిన పాత్రలే ఆమెను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి.

సమంతకు 'అత్తారింటికి దారేది' చేసే సమయానికే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరుంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అ ఆ' కూడా చేశారు. పూజా హెగ్డేకు 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' వంటి హిట్లు దక్కాయి. అయితే ఈ ఇద్దరి విజయాలన్నీ త్రివిక్రమ్ ఖాతాలో వేయలేం. ఆయన సినిమాలకంటే ముందే సమంతకు, పూజాకు ఇతర దర్శకులతో మంచి అవకాశాలు వచ్చాయి.

మరోవైపు 'అత్తారింటికి దారేది'లో నటించిన ప్రణీతకు తర్వాత 'రభస', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు వచ్చాయి. అయినా అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసే స్థాయికి వెళ్లలేకపోయారు. 'అరవింద సమేత'లో కనిపించిన ఈషా రెబ్బా పరిస్థితీ అంతే. ఆ సినిమా తర్వాత నటిగా బిజిగా కొనసాగించినా పెద్ద కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా రాలేదు. త్రివిక్రమ్‌తో సినిమా చేసిన ప్రతి నటికి ఒకే రకమైన అవకాశాలు రాలేదని తెలుస్తోంది.

2024లో వచ్చిన 'పరువు' వెబ్ సిరీస్‌లో నివేదా పేతురాజ్‌కు డిఫరెంగ్ రోల్ చేసే అవకాశం దొరికింది. కులాంతర వివాహం చేసుకున్న పల్లవిగా ఆమె పాత్ర చుట్టూ కథ సాగుతుంది. అందులో నటిగా చూపించిన ప్రతిభకు భిన్నంగా 'ఆదర్శ కుటుంబం'లో మళ్లీ తక్కువ సన్నివేశాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె చేతిలో ఎలాంటి పాత్రలు పడతాయన్నది చూడాలి. త్రివిక్రమ్ సినిమాలో రెండోసారి కనిపించినా, నివేదాకు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ఇతర దర్శకులు ఇచ్చిన పాత్రలే.