17 ఏళ్ల నట ప్రయాణంలా నిర్మాతగానూ స్వేచ్ఛగా!
నిత్యామీనన్ నట ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాల నటిగా వెండి తెరకు పరిచయమై హీరోయిన్ గా దక్షణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది.
By: Srikanth Kontham | 18 Feb 2026 10:36 AM ISTనిత్యామీనన్ నట ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాల నటిగా వెండి తెరకు పరిచయమై హీరోయిన్ గా దక్షణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. మలయాళం, కన్నడం, తెలుగు, తమిళం ఏ భాషను నిత్యామీనన్ వదిలి పెట్టలేదు. అవకాశం వచ్చిన ప్రతీచోట సత్తా చాటే ప్రయత్నం చేసింది. అలాగని నటిగా ఏ నాడు హద్దులు మీరి నటించింది లేదు. పాత్రల విషయంలో ఎంతో సెలక్టివ్ గా ఉంటుంది. పారితోషికాన్ని పక్కనబెట్టి పాత్ర కోసం పని చేసే నటి. గ్లామర్ పాత్రల విషయంలో ఎంతో కేర్ పుల్ గా ఉంటుంది.
అవసరమైతే? తప్ప ఆ రకమైన ఛాన్స్ తీసుకోదు. `ఘాటీ` లాంటి చిత్రంలో అత్యాచారానికి గురైన బాధితరాలి పాత్రలో నటించిందంటే? నిత్యామీనన్ పాత్రకు కనెక్ట్ అయితే ఎలా ఉంటుందని నిరూపించింది. అలాంటి పాత్ర పోషించాలంటే గట్స్ ఉండాలి. అవన్నీ తనలో నిండుగా ఉన్నాయని ప్రూవ్ చేసింది. `అలా మొదలైంది` నుంచి `భీమ్లా నాయక్` వరకూ నిత్యా మీనన్ ఎంతో సెలక్టివ్ గానే ప్రయాణాన్ని కొనసాగించింది. తెలుగు తెరపై 15 ఏళ్ల నట ప్రస్తానం ఆమెది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో స్వేచ్చగా పని చేసింది. ఏ నాడు పాత్రల పరంగా ఒత్తిడికి గురైంది లేదు.
ఎంతో స్వేచ్ఛగా పాత్రల్ని ఎంపిక చేసుకుని ముందుకు సాగింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అలాగని ప్రేక్షకులకు దూరం కాలేదు. టీవీ షోలతో అభిమానులకు టచ్ లోనే ఉంది. మలయాళం, తమిళ సినిమాలతో మాత్రం బిజీగానే ఉంది. ఈ క్రమంలోనే అమ్మడు తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.
కేయూరి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించింది. ఈ బ్యానర్ లో సినిమాలు కూడా అంతే స్వేచ్ఛగా నిర్మించా లనుకుంటోంది. నటిగా తన ప్రయాణం ఎలా సాగిందో? నిర్మాతగానూ అంతే సెలక్టివ్ గా ఉంటుందని సన్నిహితుల సమాచారం.
ఈ బ్యానర్ కేవలం సినిమాలు తీయడానికే కాదు. బలమైన భావోద్వేగ మార్పును తీసుకురావడానికి స్థాపించబడింది. ఈ బ్యానర్‌లో వచ్చే సినిమాలు స్క్రిప్ట్‌కు , పాత్రల లోతుకు ప్రాధాన్యతనిస్తాయి. సినిమా అంటే కేవలం కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు. మనుషుల అంతరాత్మను తాకే ఒక ప్రక్రియ. నట ప్రయాణమంతా సాఫీగా నిర్మాతగానూ కొనసాగాలి అన్నది నిత్యామీనన్ మాటల్ని బట్టి అర్దమవుతుంది. తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతుల్ని కూడా వెలుగులోకి తీసుకురావాలని నిత్యామీనన్ భావిస్తోంది.
ఈ ప్రయత్నం ఎంతో నిజాయితీగా ఉండాలంటోంది. అయితే తొలి చిత్రంగా ఎలాంటి సినిమా నిర్మిస్తుంది? అన్నది ఇంకా ప్రకటించలేదు. కేవలం బ్యానర్ మాత్రమే స్థాపించింది. ప్రస్తుతం నిత్యామీనన్ కమిట్ అయిన చిత్రాలన్నీ పూర్తయిన తర్వాత నిర్మాతగా ఎలాంటి సినిమా చేస్తుంది? అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపై నిత్యామీనన్ నటిగానే కాక..నిర్మాతగానూ రెండు పడవల ప్రయాణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు.
