క్రేజీ స్టార్ కెరీర్ దీంతో ఊపందుకుంటుందా?
నితిన్ తన నెక్స్ట్ మూవీని విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వీఐ ఆనంద్‌తో చేయబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
By: Tupaki Entertainment Desk | 26 Jan 2026 6:00 PM ISTటాలీవుడ్‌లో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో..ఎలాంటి సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందో ఎవరూ ఊహించలేరు.. ఎవరూ అంచనా వేయలేరు. అయితే ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా.. ఎంత క్రేజ్ ఉన్న సక్సెస్ లేకపోతే అంతా గుండుసున్నా అవుతుంది. ఈ విషయం టాలీవుడ్‌లో భారీ బ్యాగ్రౌండ్‌తో అరంగేట్రం చేసిన చాలా మంది హీరోల విషయంలో నిజమని తేలింది. ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ టాలెంట్ ఉన్నా కానీ..అదృష్టం, కాలం కలిసి రాకపోవడంతో హీరోలుగా నిలబడలేకపోయారు.
సక్సెస్‌లని సొంతం చేసుకోలేకపోయారు. ఇప్పటికీ ఒకరిద్దరు హీరోలు కూడా ఇదే తరహాలో సక్సెస్ కోసం..స్టార్ హీరోల ఫేజ్‌లో చేరడం కోసం ఇప్పటికి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అందులో ముందు వరుసలో నిలుస్తున్న హీరో నితిన్. హీరోగా కెరీర్ ప్రారంభించి దాదాపు 23 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోల జాబితాలో చేరలేకపోతున్న ఆయన వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. గత ఐదేళ్లుగా వరుస ఫ్లాపులని ఎదుర్కొంటూ డేంజర్ ఫేజ్‌ని ఎదుర్కొంటున్నాడు.
గత ఏడాది నటించిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చి హీరో నితిన్‌కు షాక్ ఇచ్చాయి. చివరికి అభిమాన హీరో పవన్ కల్యాణ్ `తమ్ముడు` టైటిల్‌తో చేసిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించకపోవడమే కాకుండా నిర్మాత దిల్ రాజుకు భారీ స్థాయిలో నష్టాలని తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో నితిన్ తన తదుపరి మూవీని ఎవరితో చేయబోతున్నాడు? ..దీంతో అయినా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తాడా? అనే కామెంట్‌లు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో నితిన్ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎవరూ ఊహించని డైరెక్టర్‌తో తన కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. నితిన్ తన నెక్స్ట్ మూవీని విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వీఐ ఆనంద్‌తో చేయబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షన్. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది నితిన్ నటిస్తున్న 36వ సినిమా.
ఇప్పటి వరకు వినని కథ. కొత్త అనుభూతిని పంచుతుంది` అని మేకర్స్ ప్రకటించడంతో సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. వీఐ ఆనంద్ రూపర్ నేచురల్ రొమాంటిక్ థ్రిల్లర్స్ `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, ఊరు పేరు భైరవకోన` వంటి సినిమాలతో డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత నితిన్‌తో సైన్స్ ఫిక్షన్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో వీఐ ఆనంద్ మ్యాజిక్ చేస్తాడా? .. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో నితిన్‌కు సూపర్ హిట్‌ని అందించి అతన్ని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
